ఎన్నారై డెస్క్: బాగా చదువుకోవాలి..మంచి ఉద్యోగం సంపాదించాలి.. లైఫ్‌లో సెటిలవ్వాలి.. ఇది నిన్నటి తరం యువత ఆలోచన. కానీ కాలం మారింది. సరికొత్త ఆలోచలనతో కొత్త తరం ప్రపంచంలోకి అడుగుపెట్టింది. సొంతంగా వ్యాపారం ప్రారంభించడం.. చూస్తుండగానే కోట్లకు పడగలెత్తడం..ఇదీ ఇప్పటితరం ఆలోచనా విధానం. ఆధునిక సాంకేతికత అందిస్తున్న అవకాశాలను ఒడుపుగా అందిపుచ్చుకుంటూ ఆర్థికంగా అందలాలు ఎక్కేస్తోంది నేటి యువత. ప్రస్తుతం అమెరికాలో ఆసాధారణ విజయాలను సాధిస్తున్న ఆర్నవ్ భాట్లా.. నేటి తరం ఆశయాలకు ప్రతిరూపం. సొంత సంస్థ పెట్టాలంటూ చిన్నప్పటి నుంచీ కలలు కన్న అతడు .. 21 ఏళ్ల చిరు ప్రాయంలోనే అనుకున్నది సాధించాడు. కంపెనీ ప్రారంభించిన మూడు నెలల్లోనే..మదుపర్ల నమ్మకాన్ని చూరగొని ఏకంగా.. రూ.24 కోట్ల విలువైన పెట్టుబడులను సాధించగలిగాడు. చదువు మధ్యలోనే ఆపేసి మరీ ఈ ఆసాధారణ విజయాన్ని అందుకున్నాడు.
పంజాబ్‌లో పుట్టి పెరిగిన ఆర్నవ్.. పదో తరగతి వరకూ జలంధర్‌లోనే చదువుకున్నాడు. గొప్ప వ్యాపారవేత్తగా ఎదగాలనేది అతడి చిన్ననాటి కల. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆర్నవ్ను అతడి ఆశయాల దిశగా ప్రోత్సహించారు. పదవ తరగతి పూర్తైన తరువాత ఆర్నవ్.. ముంబైలోని యూడబ్ల్యూసీ మహీంద్రా కాలేజీలో రెండేళ్ల ఇంటర్నేషనల్ బాక్కాలారియేట్ డిప్లొమా కోర్సు పూర్తి చేశాడు. ఆ తరువాత.. కెనడాలోని యూనివర్శిటీ ఆఫ్ విక్టోరియాలో.. బిజినెస్, ఆర్థికశాస్త్రం ప్రధానాంశాలుగా గల గ్రాడ్యూయేషన్ కోర్సులో చేరాడు.
అయితే.. సొంతంగా కంపెనీ పెట్టాలన్న తపన అతడిని స్తిమితంగా ఉండనీయలేదు. దీంతో.. గత ఏడాది అతడు తన చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఆపై.. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరానికి మకాం మార్చాడు. అయితే.. ఎలాంటి కంపెనీ పెట్టాలనే దానిపై అప్పటికీ ఆర్నవ్కు స్పష్టత లేదు. కేవలం.. ఆంత్రప్రెన్యూర్‌గా ఎదగాలన్న తపనే అతడిని ముందుకు నడిపింది. రిస్క్ తీసుకునే ధైర్యాన్ని ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
‘‘కాలేజీలో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు క్రిప్టో టెక్నాలజీ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించి నాకు కొన్ని ఐడియాలు ఉండేవి. కానీ.. సొంతంగా ఓ కంపెనీ స్టార్ట్ చేస్తాననే విషయంలో నాకు ఎప్పటి నుంచో స్పష్టత ఉంది. దీంతో.. గతేడాది నేను చదువుకు ఫుల్స్టాప్ పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాను. ఏ ఉత్పత్తి లాంచ్ చేయాలనేదానిపై స్పష్టత లేకపోయినా స్టార్టప్ సంస్థ ప్రారంభిస్తాననే నమ్మకం నాకు ఉంది. శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లాకే ఈ విషయాల్లో మరింత స్పష్టత వస్తుందని నాకు అప్పట్లో అనిపించింది.’’ అని ఆర్నవ్ మీడియాతో తెలిపారు.
అయితే.. యూనివర్శిటీ చదువును మధ్యలో ఆపేస్తానని ఆర్నవ్ అనడం.. అతడి తల్లిదండ్రులకు భారీ షాక్ ఇచ్చింది. ఆర్నవ్ తీసుకున్న నిర్ణయంతో తాము ఎంతో ఒత్తిడికి గురయ్యామని అతడి తండ్రి డా. నరేష్ భాట్లా తెలిపారు. కానీ.. కుమారుడికి మద్దుతుగా నిలవాలని ఆ తల్లిదండ్రులు చివరకు నిర్ణయించారు. ‘‘అతడి పట్టుదల మాకు అర్థమైంది. గతేడాది సెప్టెంబర్‌లో శాన్ఫ్రాన్సిస్కోలో దిగిన అతడు మరో నెల రోజుల్లో ఓ సాఫ్ట్వేర్ ఉత్పత్తిని తయారు చేశాడు. అయితే..ఆ సమయంలో మేమందరం ఎంతో ఒత్తిడికి లోనయ్యాం. మమ్మల్ని చాలా కొద్దిమొత్తంలో మాత్రమే డబ్బులు అడిగేవాడు. దీంతో.. అతడు చాలా పొదుపుగా జీవనం సాగిస్తున్నాడని మాకు అర్థమైంది.’’ అని నరేష్ మీడియాతో తెలిపారు.
ఇవి కూడా చదవండి
గత నవంబర్లోనే ఆర్ణవ్ తన సాఫ్ట్వేర్ ఉత్పత్తిని పూర్తిస్థాయిలో నిర్మించాడు. అతడు రూపొందించిన ప్రాడక్ట్... క్రిప్టోకరెన్సీ వాలెట్లను సాధారణ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేస్తుంది. తద్వారా.. క్రిప్టో ఆస్తులే కాకుండా.. సాధారణ ఆర్థిక లావాదేవీలను కూడా సునాయసంగా మేనేజ్ చేసుకోవచ్చు. తను రూపొందించిన సాఫ్ట్‌వేర్‌కు ఆర్నవ్.. కాయిన్బుక్స్ అని పేరు పెట్టాడు.
క్రిప్టోకార్యకలాపాలకు సంబంధించిన అంశాలపై తనకు తొలి నుంచీ ఆసక్తి అని అతడు చెప్పాడు. ‘‘వివిధ క్రిప్టోకరెన్సీలల్లో పనిచేసే 100 మంది ఆపరేటర్లతో మాట్లాడాను. టోకెన్ ఫ్లోస్‌ను మాన్యువల్‌గానే ట్రాక్ చేయాల్సి వస్తోందని వాళ్లు చెప్పారు. ఇది ఎంతో ప్రయాసతో కూడుకున్న పని. ప్రత్యేక సాఫ్ట్వేర్ ఏదీ అందుబాటులో లేదని దీంతో నాకు అర్థమైంది తేలింది. గతంలో క్రిప్టోకరెన్సీకి సంబంధించి అనేక సాఫ్ట్వేర్లను రూపొందించిన నేను.. ఇదో వ్యాపార అవకాశమని గుర్తించకపోవడం నాకే ఆశ్చర్యం కలిగించింది. బీ2బీ స్పేస్‌లోని మౌలికవసతుల వ్యవస్థ చాలా ప్రాథమికదశలో ఉందని నాకు అర్థమైంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కాయిన్బుక్స్ రూపొందించాను’’ అని చెప్పాడు.
బీ2బీ రంగంలోని అవకాశాలను కాయిన్బుక్స్ ఒడిసిపట్టుకుని లాభాలు ఆర్జిస్తుందని నమ్మిన ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు కుమ్మరించారు. అమెరికాలోని పలు ప్రముఖ సంస్థలు ఆర్నవ్ ప్రారంభించిన కంపెనీలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. అమెరికా స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించే వై కాంబినేటర్, మల్టీకాయిన్ కాపిటల్, లాటిస్ క్యాపిటల్, సీడ్ క్లబ్ వెంచర్స్ వంటి అనే క్రిప్టోపెట్టుబడుల సంస్థలు, ఆర్నవ్ స్థాపించిన సంస్థలో పెట్టుబడి పెట్టాయి. ఇప్పటికే.. అతడు 3.2 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు సేకరించగలిగాడంటే.. ఆర్నవ్ స్థాపించిన స్టార్టప్‌కు ఎంతటి ప్రాధాన్యం లభిస్తోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి