Elon Musk: భారతీయ ప్రతిభావంతులతో అమెరికాకు భారీ ప్రయోజనం!

ABN , First Publish Date - 2021-11-30T16:34:16+05:30 IST

ఇప్పటికే అనేక టెక్ దిగ్గజ సంస్థలకు అధినేతలుగా భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Elon Musk: భారతీయ ప్రతిభావంతులతో అమెరికాకు భారీ ప్రయోజనం!

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటికే అనేక టెక్ దిగ్గజ సంస్థలకు అధినేతలుగా భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం, ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ ట్విటర్‌‌ పగ్గాలు భారతీయుడైన పరాగ్ అగర్వాల్‌కు దక్కాయి. దీంతో పరాగ్‌పై భారత్ సహా ఇతర దేశాల్లోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీనిపై ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తాజాగా ట్విటర్ వేదికగా స్పందించారు. పరాగ్ నియామకాన్ని ఉద్దేశిస్తూ Stripe సీఈఓ పాట్రిక్ కొల్లిసన్ భారతీయ ప్రతిభావంతులపై చేసిన ఓ ట్వీట్‌కు మస్క్ రిట్వీట్ చేశారు. అమెరికాకు చెందిన ఆరు టెక్ దిగ్గజాలకు ఇప్పుడు భారత సంతతికి చెందిన వారు అధినేతలుగా ఉండడం నిజంగా అద్భుతం అని కొల్లిసన్ కొనియాడారు. టెక్నాలజీ ప్రపంచంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారతీయులను చూస్తుంటే నిజంగా చాలా గర్వంగా ఉందని ఆయన ప్రశంసించారు.


"గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌వర్క్‌లు మరియు ఇప్పుడు ట్విటర్ భారతదేశంలో పెరిగిన సీఈఓలతో నిర్వహించబడుతున్నాయి. సాంకేతిక ప్రపంచంలో భారతీయులు సాధిస్తున్న ఇలాంటి అద్భుతమైన విజయాన్ని చూడటం చాలా అద్భుతంగా ఉంది. వలసదారులకు అమెరికా గొప్ప అవకాశాలు ఇస్తుందడానికి ఇది నిదర్శనం" అని పాట్రిక్ కొల్లిసన్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మస్క్.. "భారతీయ ప్రతిభావంతుల నుంచి అమెరికా చాలా ప్రయోజనం పొందుతోంది" అని రిట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  



Updated Date - 2021-11-30T16:34:16+05:30 IST