Texas woman video: భారతీయులపై ద్వేషం వెళ్లగక్కి మూల్యం చెల్లించుకున్న అమెరికా మహిళ..

ABN , First Publish Date - 2022-08-27T03:39:01+05:30 IST

అమెరికా విడిచి వెళ్లిపోవాలంటూ భారతీయులపై విద్వేషం వెళ్లగక్కిన ఆమెరికా మహిళ చివరికి మూల్యం చెల్లించుకుంది.

Texas woman video: భారతీయులపై ద్వేషం వెళ్లగక్కి మూల్యం చెల్లించుకున్న అమెరికా మహిళ..

ఎన్నారై డెస్క్: అమెరికా విడిచి వెళ్లిపోవాలంటూ భారతీయులపై విద్వేషం వెళ్లగక్కిన ఆమెరికా మహిళ చివరికి మూల్యం చెల్లించుకుంది. ఆమెను అరెస్టు చేసినట్టు పోలీసులు తాజాగా ప్రకటించారు. నిందితురాలిని ఎస్మరాల్డా అప్టన్‌గా గుర్తించారు. మెక్సికో సంతతికి చెందిన ఆమె ఉత్తర టెక్సాస్‌లో ప్లేనో(Plano) నగరంలో ఉంటోంది. దాడి చేయడం, ఉగ్రవాదుల తరహా హెచ్చరికలు చేయడం తదితర అభియోగాలపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.


అమెరికాలోని కొంత మంది భారతీయ మహిళలపై(Indian americans) స్థానికురాలు విద్వేషం వెళ్లగక్కిన వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. స్థానిక కాలమానం ప్రకారం.. టెక్సాస్ రాష్ట్రంలోని(Texas) డాలస్ పార్క్‌వేలో ఈ ఘటన వెలుగు చూసింది. వారికి ఎదురుపడిన నిందితురాలు అకారణంగా వారిపై రెచ్చిపోయింది.  "మీ ఇండియన్స్ అంటే నాకు అసహ్యం. మెరుగైన జీవితం కోసం అమెరికాకు వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఉచితంగా కావాలంటారు. నేను మెక్సికన్-అమెరికన్ అయినప్పటికీ ఇక్కడే పుట్టాను. ఇండియాలో మంచి జీవితం ఉంటే.. మళ్లీ ఇక్కడి రావడం ఎందుకు? గో బ్యాక్ టు ఇండియా" అని నోరు పారేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి గగ్గోలు రేపింది. దీంతో.. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమె బెయిల్ పొందేందుకు పది వేల డాలర్లు కట్టాలన్న నిబంధన విధించినట్టు తెలిపారు. 





Updated Date - 2022-08-27T03:39:01+05:30 IST