US vaccine: మేం రెడీనే, మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు.. భారత్‌తో అమెరికా!

ABN , First Publish Date - 2021-07-14T20:56:46+05:30 IST

భారత్‌కు తాము కేటాయించిన టీకా డోసులు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నాయని, భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే టీకాలు సరఫరా చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తాజాగా వ్యాఖ్యానించారు.

US vaccine: మేం రెడీనే, మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు.. భారత్‌తో అమెరికా!

వాషింగ్టన్: భారత్‌కు తాము కేటాయించిన టీకా డోసులు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నాయని, భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే టీకాలు సరఫరా చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తాజాగా పేర్కొన్నారు. అమెరికా కరోనా టీకాలను స్వీకరించేందుకు భారత్ కొన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. ‘‘అమెరికా టీకా విరాళానికి సంబంధించి కొన్ని చట్టపరమైన అంశాలను సమీక్షించేందుకు భారత్ మరికొంత సమయం కోరింది. ఈ ప్రక్రియ పూర్తవగానే అమెరికా టీకాలు భారత్‌కు అందుతాయి’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. 


కాగా.. వైద్య, బయోమెడికల్ రంగాల్లో పరిశోధనకు సంబంధించి అమెరికా, భారత్ మధ్య దశాబ్దాలుగా భాగస్వామ్యం ఉందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. ఈ భాగస్వామ్యం పునాదిగానే కొవిడ్-19పై ఇరు దేశాల ఉమ్మడి కార్యాచరణ ఏర్పడిందన్నారు. అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు  వైద్య పరీక్షలు, ఔషధాలు, టీకాలు వంటి పలు అంశాలపై రెండు దేశాలూ కలసి పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. అత్యవసర ఔషధాలను తగిన సమయంలో తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంచాల్సిన అవశ్యకతను కూడా భారత్, అమెరికా గుర్తించాయని ఆయన పేర్కొన్నారు. ‘‘భారత దేశ ఫార్మా రంగం శక్తి సామర్థ్యాల కారణంగానే ఇది సాధ్యమైంది. టీకా తయారీలో, ప్రపంచవ్యాప్తంగా వాటిని అందుబాటులోకి తేవడంలో భారత్‌ది కీలక పాత్ర. కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి అమెరికా ఫార్మా కంపెనీలు భారత కంపెనీలతో కలసి పనిచేస్తున్నాయి.’’ అని నెడ్ ప్రైస్ తెలిపారు.  


వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నేతృత్వంలోని కొవ్యాక్స్ వ్యవస్థ ద్వారా భారత్‌కు టీకాలు అందాలి. ఇప్పటివరకూ అమెరికా నుంచి నేరుగా భారత్ టీకాలను విరాళంగా స్వీకరించలేదు. ఇక వివిధ దేశాల కరోనా టీకా అవసరాలను తీర్చేందుకు అమెరికా తన టీకా నిల్వల్లోని 80 మిలియన్ డోసులను కేటాయించిన విషయం తెలిసిందే. అమెరికాలో టీకాకరణ సంతృప్తికర స్థాయిలో ఉన్నందున బైడెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలోని కొవ్యాక్స్ వ్యవస్థ ద్వారా లేదా ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా నేరుగా టీకాలు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు గతంలో ప్రకటించారు. 

Updated Date - 2021-07-14T20:56:46+05:30 IST