పెట్రోల్ బంక్‌లో ట్రక్ డ్రైవర్‌కు కలిసొచ్చిన అదృష్టం.. ఏకంగా 7.5 కోట్లు..!

ABN , First Publish Date - 2022-07-03T00:49:36+05:30 IST

అదృష్టం ఎప్పుడు ఎలా లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇటీవల ఓ అమెరికా ట్రక్ డ్రైవర్ జీవితంలోనూ సరిగ్గా ఇదే జరిగింది.

పెట్రోల్ బంక్‌లో ట్రక్ డ్రైవర్‌కు కలిసొచ్చిన అదృష్టం.. ఏకంగా 7.5 కోట్లు..!

ఎన్నారై డెస్క్: అదృష్టం ఎప్పుడు ఎలా లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇటీవల ఓ అమెరికా ట్రక్ డ్రైవర్(US Truck driver) జీవితంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. పెట్రోల్ బంక్‌లో అతడి జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. అక్కడ కొన్న ఓ లాటరీ టిక్కెట్టు కారణంగా అతడు ఏకంగా 10 లక్షల డాలర్ల జాక్ పాట్ కొట్టేశాడు. మన కరెన్సీలో చెప్పాలంటే ఇది దాదాపు రూ.7.5 కోట్లకు సమానం. ఇల్లినాయ్(Illinois) రాష్ట్రానికి చెందిన అతడు.. మిషిగన్‌కు వెళ్లే క్రమంలో దారిలో కనిపించిన ఓ పెట్రోల్ బంక్ వద్ద వాహనాన్ని ఆపాడు. అక్కడో లాటరీ టిక్కెట్టు కొన్నాడు. ఆ తరువాత.. దానిపై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేయడంతో లాటరీ గెలుపొందినట్టు అతడి సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. చిన్నమొత్తమే వచ్చి ఉంటుందిలే అనుకుని అతడు తన ట్రక్‌లోకి వచ్చి కూర్చున్నాడు. 


ఆ తరువాత.. కుతూహలం కొద్దీ తన లాటరీ నెంబర్‌ను మరోసారి చెక్ చేస్తే.. రూ.7.5 కోట్ల లాటరీ వచ్చినట్టు తేలింది. దీంతో అతడు ఆశ్చర్యపోయాడు. మరోసారి టిక్కెట్‌ను తేరిపారా చూసుకుని.. జాక్‌పాట్ కొట్టిన విషయం నిజమేనని నిర్ధారించుకున్నాడు. ఈ క్రమంలో లాటరీ కంపెనీ వాళ్లకు ఫోన్ కూడా చేసి ఈ విషయాన్ని రూఢీ పరుచుకున్నాడు. దీంతో.. అంతకుమునుపు తాను పొరపాటు పడ్డానన్న విషయం అతడికి అర్థమయ్యింది. కాగా.. టాక్స్‌లు పోనూ అతడి చేతికి సుమారు ఏడు లక్షల డాలర్లు అందింది. ఆ డబ్బుతో తాను ఓ కొత్త ట్రక్ కొంటానని అతడు మీడియాకు తెలిపాడు. వీలైతే కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం కూడా మదుపు చేస్తానని చెప్పాడు. తన పేరు, ఇతర వివరాలను గోప్యంగా ఉంచాలని మీడియాను అభ్యర్థించాడు.

Updated Date - 2022-07-03T00:49:36+05:30 IST