Racial Discrimination in US: పాపం.. ఆ పిల్లలు ఎంత బాధపడి ఉంటారో.. అగ్రరాజ్యంలో హాట్‌టాపిక్‌గా మారిన వైరల్‌ వీడియో..!

ABN , First Publish Date - 2022-07-30T22:12:15+05:30 IST

అది అమెరికాలోని ప్రముఖ అమ్యూ‌స్‌మెంట్ పార్క్. చిన్నారుల కేరింతలు, నవ్వులతో కళకళలాడే ప్రదేశం. అలాంటి చోట జ్యాత్యాహంకార ధోరణి(Racial Discrimination) వెలుగు చూసింది. లోకంపోకడ తెలియని ఇద్దరు చిన్నారులు చిన్నబుచ్చుకునేలా చేసింది.

Racial Discrimination in US: పాపం.. ఆ పిల్లలు ఎంత బాధపడి ఉంటారో.. అగ్రరాజ్యంలో హాట్‌టాపిక్‌గా మారిన వైరల్‌ వీడియో..!

ఎన్నారై డెస్క్: అది అమెరికాలోని ప్రముఖ అమ్యూ‌స్‌మెంట్ పార్క్. చిన్నారుల కేరింతలు, నవ్వులతో కళకళలాడే ప్రదేశం. అలాంటి చోట జాత్యాహంకార ధోరణి(Racism) వెలుగు చూసింది. లోకంపోకడ తెలియని ఇద్దరు చిన్నారులు చిన్నబుచ్చుకునేలా చేసింది. అగ్రరాజ్యంలో హాట్‌టాపిక్‌గా మారిన ఈ ఉదంతంపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు.. పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడేల్ఫియా నగర శివారు ప్రాంతమైన బక్స్ కౌంటీలో సెసెమీ ప్లేస్(Sesame place) అనే అమ్యూస్‌మెంట్ పార్క్ ఉంది. అమెరికాలోని చిన్నారుల టీవీ షో  సెసెమీ స్ట్రీట్ ఆధారంగా దీన్ని ఏర్పాటు చేశారు. టీవీ స్క్రీన్‌పై కనిపించే కార్టూన్ క్యారెక్టర్లను చిన్నారులు పార్క్‌లో ప్రత్యక్షంగా చూస్తూ కేరింతలు కొడుతుంటారు.


ఇటీవల.. బాల్టిమోర్ నగరానికి చెందిన నల్లజాతి మహిళ జోడీ బ్రౌన్.. ఐదేళ్ల వయసున్న తన కూతురు, మేనకోడలిని తీసుకుని పార్క్‌కు వెళ్లారు. అక్కడున్న కార్టూన్ పాత్రధారులను చూస్తూ చిన్నారులు కేరింతలు కొడుతున్నారు. ఈ దృశ్యాల్ని జోడీ తన కెమెరాలో రికార్డు చేయసాగింది. ఇంతలో తమకిష్టమైన కార్టూన్ పాత్ర డ్రెస్‌లో ఓ వ్యక్తి తమవైపు రావడం చూసి ఆ ఇద్దరు చిన్నారులు సంబరపడిపోయారు. చేయి కలపాలని తపనపడ్డారు. అతడు దగ్గరకి వచ్చే కొద్దీ వారిలో ఉత్సాహం పెరిగిపోయింది. కానీ.. అక్కడ నిలబడ్డ శ్వేతజాతి పిల్లలతో చేయి కలిపిన ఆ వ్యక్తి.. ఈ ఇద్దరితో చేయి కలపడం కుదరదని చెబుతూ ముందుకు వెళ్లిపోయాడు. దీంతో.. చిన్నారులు ఒక్కసారిగా చిన్నబుచ్చుకున్నారు. అసలేం జరిగిందో అర్థం కాక తెల్లముఖం వేశారు. అక్కడే ఉన్న జోడి ఇదంతా కెమెరాలో బంధించడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వైరల్‌గా మారింది. అమెరికాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లలపై కూడా జాత్యాహంకార విషం కక్కుతారా అంటూ మండిపడ్డారు. పాపం.. ఆ పిల్లలు ఎంత బాధపడి ఉంటారో అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. 


తమపై ఇలా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో థీమ్ పార్క్ యాజమాన్యం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొన్ని సందర్భాల్లో సిబ్బంది చిన్నారుల అభ్యర్థనలను తిరస్కరిస్తారని, తమ డ్రెస్ కారణంగా సిబ్బందికి ఒక్కోసారి పసివాళ్లు కనబడరని వివరణ ఇచ్చింది. జరిగిన ఘటనపై ఆ కార్టూన్ పాత్రధారి ఎంతో ఆవేదన చెందుతున్నాడని చెప్పుకొచ్చింది. అందరి పట్ల సమభావంతో ఉండటమే తమ ఉద్యోగుల విధానమని వివరణ ఇచ్చింది. అయితే..నెటిజన్లు మాత్రం శాంతించలేదు. దీంతో.. సోమవారం థీమ్ పార్క్ యాజమాన్యం ప్రజలకు క్షమాపణ చెబుతూ మరో ప్రకటన విడుదల చేసింది. తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుంటామని హామీ ఇచ్చింది. మరోవైపు.. థీమ్‌ పార్క్‌పై చట్టపరమైన చర్యలకు జోడీ బ్రౌన్ ఉపక్రమించారు. జాత్యాహంకారానికి వేదికైన థీమ్‌ పార్క్ యాజమాన్యం తమకు 25 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలంటూ కేసు దాఖలు చేశారు. ఇక మరెన్నడూ ఆ థీమ్‌ పార్క్‌లో కాలుపెట్టనంటూ జోడీ బ్రౌన్ ఇన్‌స్టాలో కామెంట్ చేశారు. 



Updated Date - 2022-07-30T22:12:15+05:30 IST