విమానంలో మహిళకు కరోనా పరీక్ష.. పాజిటివ్ అని తేలడంతో 4 గంటలపాటు బాత్‌రూంలో నరకయాతన..

ABN , First Publish Date - 2021-12-31T18:13:56+05:30 IST

ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో చాలా దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి.

విమానంలో మహిళకు కరోనా పరీక్ష.. పాజిటివ్ అని తేలడంతో 4 గంటలపాటు బాత్‌రూంలో నరకయాతన..

చికాగో: ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో చాలా దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా విమాన ప్రయాణాలపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా బోర్డింగ్‌కు ముందు, ఆ తర్వాత కరోనా టెస్టులు తప్పనిసరి. అలాగే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా తప్పకుండా చూపించాల్సిందే. దీంతో ప్రయాణికులకు ఒకింతా ఇవి తలకు మించిన భారంగా పరిణమిస్తున్నాయి. కానీ, తప్పడం లేదు. అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యపడడం లేదు. దీనికి చక్కటి ఉదాహరణ తాజాగా యూఎస్‌లో జరిగిన ఓ ఘటన. విమానం ఎక్కేముందు ఒకటికి నాలుగు సార్లు కోవిడ్ టెస్టు చేయించుకున్న ఓ మహిళకు ఆ ఫ్లైట్‌లో ఉండగానే పాజిటివ్ అని తేలింది. అంతే.. మిగతా ప్రయాణికులకు ఆమె నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా మహిళను నాలుగు గంటల పాటు విమానం బాత్‌రూంలో ఐసోలేట్ చేశారు. 


వివరాల్లోకి వెళ్తే.. ఓ విమానం డిసెంబర్ 19న చికాగో నుంచి ఐస్​లాండ్‌లోని రేక్జావిక్ బయల్దేరింది. విమానంలో మొత్తం 150మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ విమాన ప్రయాణం మొత్తం సమయం ఐదు గంటలు. అయితే, మార్గం మధ్యలో మారిసా ఫోటీయో అనే మహిళ​కు అసౌకర్యంగా అనిపించడంతో పాటు గొంతులో నొప్పి మొదలైంది. దీంతో విమాన సిబ్బంది ప్రయాణంలోనే ఆమెకు కరోనా పరీక్ష నిర్వహించారు. ఆ ర్యాపిడ్​ టెస్టులో ఆమెకు పాజిటివ్​ అని తేలింది. ఇక జర్నీ మొదలైన గంటలోపే మారిసాకు పాజిటివ్​ అని తేలడంతో తన సీటును వదిలేసి విమానం బాత్​రూంకు వెళ్లిపోయిందామె. నాలుగు గంటల పాటు మారిసా బాత్​రూంలోనే స్వీయ నిర్బంధంలో ఉండిపోయింది. ఆ నాలుగు గంటలు నరకయాతన అనుభవించానని ఈ సందర్భంగా మారిసా తనకు ఎదురైన విపత్కర పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 

Updated Date - 2021-12-31T18:13:56+05:30 IST