డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తులో ఒకే ఒక్క టిక్ మార్కు.. America నుంచి ఆ భారతీయుడిని బహిష్కరించేలా చేసింది..!

ABN , First Publish Date - 2022-05-18T02:38:42+05:30 IST

అతడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడు.. ఆ తరువాత డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునే క్రమంలో పొరపాటున తాను అమెరికా పౌరుడినని పేర్కొన్నాడు. ఆ పొరపాటే అతడి జీవితాన్ని తలకిందులు చేసింది. ఇప్పుడు అతడు దేశబహిష్కరణకు గురయ్యే స్థితికి చేరుకున్నాడు. అమెరికాలోని పంకజ్‌కుమార్ పటేల్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి ఇది.

డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తులో ఒకే ఒక్క టిక్ మార్కు.. America నుంచి ఆ భారతీయుడిని బహిష్కరించేలా చేసింది..!

ఎన్నారై డెస్క్: అతడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడు.. ఆ తరువాత డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునే క్రమంలో పొరపాటున తాను అమెరికా పౌరుడినని పేర్కొన్నాడు. ఆ పొరపాటే అతడి జీవితాన్ని తలకిందులు చేసింది. ఇప్పుడు అతడు దేశబహిష్కరణకు గురయ్యే స్థితికి చేరుకున్నాడు. అమెరికాలోని పంకజ్‌కుమార్ పటేల్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి ఇది. 


1990ల్లో పంకజ్‌కుమార్ పటేల్ తన కుటుంబంతో సహా అమెరికాకు అక్రమంగా వలస వెళ్లారు. ఆ తరువాత..2007లో అమెరికాలో శాశ్వత నివాసార్హత(గ్రీన్ కార్డు) కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ‘‘అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్‌’’ కోసం యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్  సర్వీసెస్ శాఖకు(యూఎస్‌సీఐఎస్)  దరఖాస్తు చేశారు. గ్రీన్ కార్డు ‌పొందేందుకు ఇది తొలి మెట్టు. యూఎస్‌సీఐఎస్ విచక్షణాధికారాల కింద పటేల్ ఈ దరఖాస్తు చేసుకున్నారు.  అయితే..  ఆయన దరఖాస్తును పరిశీలించిన అధికారులకు పటేల్ గతంలో చేసిన ఓ తప్పిదం గురించి తెలిసింది.  జార్జియా రాష్ట్రంలో పటేల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన సందర్భంగా.. తాను అమెరికా పౌరుడినని పేర్కొంటూ దరఖాస్తు ఫారమ్‌లోని ఓ గడిలో అతడు టిక్ మార్కు పెట్టినట్టు  గుర్తించారు. అమెరికా పౌరసత్వం ఉన్న వారు ప్రత్యేకంగా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీంతో.. పటేల్ పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. అమెరికా చట్టాల ప్రకారం.. వలసదారులు అసత్యాలు చెప్పిన పక్షంలో దేశబహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంది.  ఈ క్రమంలో అధికారులు అతడిని స్వదేశానికి పంపించే ఏర్పాట్లు ప్రారంభించారు. 


దీన్ని వ్యతిరేకిస్తూ పటేల్ తొలుత ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తికి అప్పీల్ చేసుకున్నారు. డ్రైవింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసే సమయంలో తాను పొరపడ్డానని, కాబట్టి తాను చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా భావించరాదని వాదించారు. అయితే.. న్యాయమూర్తి ఈ వాదనతో ఏకీభవించకపోవడంతో తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలో పటేల్ బోర్డ్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అప్పీల్స్‌‌ను వేడుకున్నా ఆయనకు నిరాశే ఎదురైంది. అయితే.. పటేల్ పట్టువిడవకుండా.. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఆప్పీల్స్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. యూఎస్‌సీఐఎస్ విచక్షణాధికారులు తమ పరిధిలోకి రావని ఈ కోర్టు తేల్చి చెప్పింది. చివరి ప్రయత్నంగా పటేల్ గతేడాది జనవరిలో అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్‌లో ఆయన అప్పీలుపై విచారణ జరగ్గా.. సోమవారం తొమ్మది మంది సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే.. ఇక్కడా ఆయనకు చుక్కెదురైంది. తొమ్మది మంది న్యాయమూర్తుల్లో ఐదుగురు  కింది కోర్టు తీర్పుతో ఏకీభవించారు. అటార్నీ జనరల్ విచక్షణాధికారాలను కోర్టులు సమీక్షించ కూడదంటూ కాంగ్రెస్ చేసిన చట్టాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.  దీంతో.. పటేల్‌కు నిరాశే ఎదురయ్యింది. అయితే.. కోర్టు సమీక్షకు పరిమితులు విధిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని మిగిలిన నలుగురు న్యాయమూర్తులూ వ్యాఖ్యానించడం గమనార్హం.  కాగా.. పటేల్‌కు ముగ్గురు సంతానం. వారిలో ఒకరికి అమెరికా పౌరసత్వం ఉంది. మిగతా ఇద్దరూ అమెరికా జాతీయులను వివాహం చేసుకున్నారు. 



Updated Date - 2022-05-18T02:38:42+05:30 IST