అమెరికా సంచలన నిర్ణయం.. విదేశీ విద్యార్థులకు షాక్‌ !

ABN , First Publish Date - 2020-07-08T13:07:24+05:30 IST

అమెరికాలోని లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపేలా అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ కారణంగా విద్యాసంస్థలు పూర్తిగా ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు మారితే... ఆ కాలేజీల్లోని విదేశీ విద్యార్థులు అమెరికాను విడిచి వెళ్లాల్సి ఉంటుంది.

అమెరికా సంచలన నిర్ణయం.. విదేశీ విద్యార్థులకు షాక్‌ !

కాలేజీ పూర్తిగా ఆన్‌లైన్‌కి మారితే..

అమెరికా నుంచి వెళ్లిపోవాల్సిందే..

విదేశీ విద్యార్థులకు అమెరికా ఆదేశం

ఆఫ్‌లైన్‌ కాలేజీకి మారితే ఓకే

యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ ఆదేశాలతో ఆందోళన

చైనా తరవాత భారత్‌ నుంచే ఎక్కువ మంది

కొత్తగా చేరే విద్యార్థులకు వీసాలు బంద్‌

దిక్కుతోచని స్థితిలో యూఎస్‌ విద్యాసంస్థలు

భయానక నిర్ణయం: అమెరికా విద్యావేత్తలు

వాషింగ్టన్‌, జూలై 7: అమెరికాలోని లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపేలా అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది.  కొవిడ్‌ కారణంగా విద్యాసంస్థలు పూర్తిగా  ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు మారితే... ఆ కాలేజీల్లోని విదేశీ విద్యార్థులు అమెరికాను విడిచి వెళ్లాల్సి ఉంటుంది.  ఈ మేరకు యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం (ఐసీఈ) మార్గదర్శకాలను జారీ చేసింది. అలాగే సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు నిర్వహించనున్న సెమిస్టర్‌కి సంబంధించి కొత్తగా వీసాలు జారీ చేయబోమని కూడా స్పష్టం చేసింది. చట్టబద్ధంగా ఉండాలనుకునే వారు భౌతికంగా తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించే విద్యాసంస్థలకు బదిలీ కావాలని, లేదంటే ఇమ్మిగ్రేషన్‌ తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని ఐసీఈ హెచ్చరించింది. మరోవైపు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు మాధ్యమాల (హైబ్రిడ్‌) ద్వారా తరగతులు నిర్వహిస్తున్న సంస్థలు తమ విద్యార్థులు భౌతికంగా హాజరవుతున్నారని నిరూపించుకోవాలని స్పష్టం చేసింది. ఈ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఒకటి కంటే ఎక్కువ లేదా త్రీ ఆన్‌లైన్‌ క్రెడిట్‌ అవర్సే అనుమతిస్తారు. కోర్సును పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించడం లేదని, విద్యార్థులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండింటికీ హాజరవుతున్నారని సదరు విద్యా సంస్థ స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌కు ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది విదేశీ విద్యార్థులకు ఆశనిపాతంలా మారింది. ముఖ్యంగా సెప్టెంబరులో ప్రారంభం కానున్న సెమిస్టర్‌లో అడ్మిషన్‌ పొందాలని చూస్తున్న విదేశీ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు అమెరికా నిర్ణయంతో అక్కడి విద్యాసంస్థలన్నీ దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.


చైనా తరవాత భారత్‌ నుంచే ఎక్కువ..

యూఎ్‌సలోని వర్సిటీలు, కాలేజీల్లో అకడమిక్‌ ప్రోగ్రామ్‌లలో ఎఫ్‌-1 వీసాతో, వృత్తిపరమైన లేదా ఇతర గుర్తింపు పొందిన సాంకేతిక విద్యాసంస్థల్లో ఎమ్‌-1 వీసాతో విదేశీ విద్యార్థులు చేరతారు. యూఎ్‌సకు చెందిన స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌(ఎ్‌సఈవీపీ) 2018 గణంకాల ప్రకారం  2017, 2018 విద్యా సంవత్సరాల్లో  చైనా(478,732) తరవాత భారత్‌(251,290) నుంచే అధిక సంఖ్యలో  విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు.  ఐసీఈ నిర్ణయంపై అమెరికాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఈ చర్యను అమెరికాలోని పలువురు విద్యావేత్తలు, చట్టసభల సభ్యులు ‘భయానక’ నిర్ణయంగా అభివర్ణించారు. ఐసీఈ జారీ చేసిన మార్గదర్శకాలు భయంకరంగా ఉన్నాయని, ఈ విషయంలో తాము మరింత స్పష్టతను కోరుతున్నామని ది అమెరికన్‌ కౌన్సిల్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌(ఏసీఈ) అధ్యక్షుడు టెడ్‌ మిచెల్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ కూడా ఈ నిర్ణయంపై తీవ్రంగా విరుచుకు పడింది.  


మీ నిర్ణయం సరైంది కాదు: భారత్‌

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తీసుకున్న నిర్ణయంపై భారత్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది.  భారత వీదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా యూఎస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ స్టేట్‌ సెక్రటరీ డేవిడ్‌ హేల్‌తో నిర్వహించిన ఆన్‌లైన్‌ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. భారతీయ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడతామని డేవిడ్‌ హేల్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Updated Date - 2020-07-08T13:07:24+05:30 IST