1.9ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి యూఎస్ సెనేట్ ఆమోదం !

ABN , First Publish Date - 2021-03-07T13:49:50+05:30 IST

1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీ బిల్లును అమెరికన్ సెనేట్‌ శనివారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు 50-49 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.

1.9ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి యూఎస్ సెనేట్ ఆమోదం !

వాషింగ్టన్: 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీ బిల్లును అమెరికన్ సెనేట్‌ శనివారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు 50-49 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. దాదాపు రిపబ్లికన్​ సభ్యులంతా ఈ బిల్లును వ్యతిరేకించడం గమనార్హం. కాగా, అమెరికా చరిత్రలోనే ఇదే భారీ ఉద్దీపన ప్యాకేజీ కూడా. ఇక అగ్రరాజ్యంపై మహమ్మారి పంజా విసరడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చతికిలపడిన విషయం తెలిసిందే. కోట్లాది మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయి రోడ్డునపడ్డారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బైడెన్.. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు ఊతమిచ్చేలా, రాష్ట్రాలన్నీ కోలుకునే విధంగా, అమెరికా పౌరులను ఆర్థిక అవస్థల నుంచి బయటపడేసేందుకు 1.9 ట్రిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. 


తాజాగా ఈ బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టారు. దాదాపు రిపబ్లికన్​ సభ్యులంతా వ్యతిరేకించిన ఈ బిల్లు సెనేట్‌లో 50-49 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. దీంతో మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న అమెరికన్లను ఆదుకునేందుకు బైడెన్ ప్రకటించిన 1.9 ట్రిలియన్‌ డాలర్ల సాయం అమలు దిశగా ముందడుగు పడినట్లైంది. ఈ బిల్లును వచ్చేవారం కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ కూడా​ ఆమోదం పొందితే అధ్యక్షుడు బిల్లుపై సంతకం చేస్తారు. బైడెన్ సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చుతుంది. ఇది కార్యరూపం దాలిస్తే అమెరికా పౌరులకు భారీ ఉపశమనం లభిస్తోంది. అమెరికన్లకు ఆర్థిక సాయం, పన్ను మినహాయింపులు, మహమ్మారిపై పోరుకు నిధులను ఖర్చు చేస్తారు. 


సుమారు 400 బిలియన్ డాలర్లు ఆర్థిక సాయంగా అందించనున్నారు. దీంతో నేరుగా ఒక్కొ అమెరికన్ పౌరుడిగా ఖాతాలో 1400 డాలర్లు జమ అవుతాయి. అలాగే రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల ఆర్థిక బలోపేతానికి 350 బిలియన్ డాలర్లు కేటాయించనున్నారు. కాగా, సెనేట్‌లో బిల్లు ఆమోదం పొందడంపై అధ్యక్షుడు జో బైడెన్‌ హర్షం వ్యక్తం చేశారు. కరోనా వల్ల అమెరికా చాలా నష్టపోయిందని, అందుకే సాయంగా ఈ బిల్లును తీసుకువచ్చామని పేర్కొన్నారు. 5.30 లక్షల మందిని పొట్టన బెట్టుకున్న మహమ్మారిపై పోరాటానికే బిల్లులో ప్రతిపాదించిన అధిక మొత్తాన్ని వెచ్చించనున్నట్లు ఈ సందర్భంగా బైడెన్ తెలియజేశారు. గత ఏడాది కాలంలోనే సుమారు 9.5 మిలియన్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని, వీరిని కూడా ఈ బిల్లు ద్వారా ఆదుకుంటామని అధ్యక్షుడు తెలిపారు. 

Updated Date - 2021-03-07T13:49:50+05:30 IST