చైనాకు చెక్.. కీలక బిల్లుకు యూఎస్ సెనెట్ ఆమోదం!

ABN , First Publish Date - 2021-06-13T01:35:31+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కకావికలమైనా చైనా మాత్రం వృద్ధి బాటలో పయనిస్తోంది.

చైనాకు చెక్.. కీలక బిల్లుకు యూఎస్ సెనెట్ ఆమోదం!

కరోనా మహమ్మారి కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కకావికలమైనా చైనా మాత్రం వృద్ధి బాటలో పయనిస్తోంది. కరోనా వైరస్‌ను ధీటుగా ఎదుర్కొంటూనే.. భారీ వృద్ధి సాధించింది. కరోనా ధాటికి విలవిలలాడిన అమెరికాను వెనక్కి నెట్టి సూపర్ పవర్‌గా ఎదగాలని ప్రయత్నిస్తోంది. చైనా ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు అమెరికా కూడా సన్నద్ధమవుతోంది. 


చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. చైనాకు చెక్ పెట్టే కీలక బిల్లుకు యూఎస్ సెనెట్ తాజాగా ఆమోదం తెలిపింది. చైనా నుంచి పెరుగుతున్న ఆర్థిక ముప్పును ఎదుర్కోవటానికి భారీ పారిశ్రామిక విధాన బిల్లును రూపొందించింది. శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు దాదాపు 170 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనుంది. 


పరస్పర విరుద్ధ భావాలు కలిగిన రిప‌బ్లిక‌న్లు, డెమోక్రాట్లు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాను ఢీకొట్టాలంటే శాస్త్ర‌, సాంకేతిక రంగాల‌ను బ‌లోపేతం చేయాల్సిందేనని ఇరు పార్టీల నేతలూ తెలిపారు. సెనెట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లు ప్రతినిధుల స‌భ‌లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అనంతరం అమెరికా అధ్యక్షుడి సంతకం కోసం వైట్‌హౌస్‌కు వెళుతుంది. అనంతరం చట్టంగా మారుతుంది. 


చైనాతో పోటీలో అమెరికా ఏయే రంగాలలో తక్కువగా ఉందో ఆయా రంగాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. ముఖ్యంగా తయారీ రంగంపై దృష్టి సారించనున్నారు. సాంకేతిక పరిశోధన, సెమీకండ‌క్ట‌ర్ డెవ‌లప్‌మెంట్, రోబో తయారీ, చిప్ మేకింగ్‌ మొదలైన వాటి కోసం భారీగా ఖ‌ర్చు చేయ‌నున్నారు. అలాగే ఈ చట్టం ప్రకారం చైనాలో త‌యారైన డ్రోన్ల‌ను అమెరికా సంస్థలు కొనుగోలు చేయ‌రాదు. ఇక, తరచుగా అమెరికన్ సంస్థలపై సైబ‌ర్ దాడుల‌కు పాల్ప‌డుతున్న చైనా సంస్థ‌ల‌పై గట్టి చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. 

Updated Date - 2021-06-13T01:35:31+05:30 IST