బైడెన్ లక్ష్యం వైపు దూసుకుపోతున్న అమెరికా!

ABN , First Publish Date - 2021-03-06T21:27:38+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 82 మిలియన్ల మందికి వ్యాక్సిన్‌ను అందించినట్టు వైట్‌హౌస్ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ప్రపంచంలోని ఏ దేశం కూడా ఈ స్థాయి

బైడెన్ లక్ష్యం వైపు దూసుకుపోతున్న అమెరికా!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్‌లో  దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 82 మిలియన్ల మందికి వ్యాక్సిన్‌ను అందించినట్టు వైట్‌హౌస్ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ప్రపంచంలోని ఏ దేశం కూడా ఈ స్థాయిలో ప్రజలకు టీకాను అందించలేదని పేర్కొన్నారు. కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్ న్యూస్ కాన్ఫ‌రెన్స్ సందర్భంగా శ్వేతసౌతం అధికారులు ఈ వ్యాఖ్యలు చేశారు. 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అమెరికన్లలో దాదాపు 55 శాతం మంది టీకా మొదటి డోసును పొందినట్టు చెప్పారు. అంతేకాకుండా ఇందులో చాలా మంది రెండో డోసును కూడా తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 450 ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్యను మరింత పెంచనున్నట్టు పేర్కొన్నారు. 



కాగా.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచే మహమ్మారిని వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటానని ప్రమాణ స్వీకారానికి ముందు జో బైడెన్ ప్రకటించారు. అగ్రరాజ్య అధినేతగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. తొలి వంద రోజుల్లోనే 100 మిలియన్ల మందికి వ్యాక్సిన్‌ను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్య అధినేతగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేసి.. 50 రోజులు కూడా గడువక ముందే.. బైడెన్ లక్ష్యం వైపు అమెరికా దూసుకుపోతోంది. 


ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ మరణాలు మాత్రం విపరీతంగా సంభవిస్తున్నాయి. ప్రతి రోజు సుమారు వెయ్యికి పైగా ప్రజలు మహమ్మారికి బలవుతున్నారు. వరల్డ్ఒమీటర్.ఇన్‌ఫోలోని సమాచారం ప్రకారం అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 3కోట్లకు చేరువయ్యింది. ఇదే సమయంలో 5.35లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2021-03-06T21:27:38+05:30 IST