US లో కరోనా విలయం.. ఒక్క రోజే 10లక్షల కేసులు.. వేలాది విమానాలు రద్దు!

ABN , First Publish Date - 2022-01-05T13:13:30+05:30 IST

అభివృద్ధిలో.. అవకాశాల్లో.. మెరుగైన ప్రజా జీవనంలో మిగతా ప్రపంచం అంతా ఒక ఎత్తు.. అమెరికా ఒక ఎత్తు అంటుంటారు. అలాంటి అగ్రరాజ్యం ఇప్పుడు కొవిడ్‌ ఒమైక్రాన్‌ వేరియంట్‌ కోరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొత్త ఏడాది ప్రారంభంలో వైరస్‌ మంచు తుపానులా విరుచుకుపడుతుందని నిపుణులు అంచనా వేస్తే, అంతకుమించి..

US లో కరోనా విలయం.. ఒక్క రోజే 10లక్షల కేసులు.. వేలాది విమానాలు రద్దు!

అమెరికాలో ఒక్క రోజే పది లక్షల మందికి కరోనా.. ఇంగ్లండ్‌లో 2.18 లక్షల కేసులు

డెల్టా ఉధృతి వేళ.. మిగతా అన్ని దేశాలలోవచ్చిన కేసుల కంటే యూఎస్‌లో డబుల్‌

రోజువారీ ప్రజా జీవనంపై తీవ్ర ప్రభావం

వైద్య వ్యవస్థపై మోయలేనంతగా భారం

వేలాది విమానాలు రద్దు.. మరిన్ని ఆలస్యం

న్యూయార్క్‌ మెట్రోలో సర్వీసుల సస్పెన్షన్‌

పరిస్థితులు ఇంకా దారుణంగా మారొచ్చు

కొవిడ్‌తో షట్‌ డౌన్‌ దశకు ఆర్థిక వ్యవస్థ

వాషింగ్టన్‌, జనవరి 4: అభివృద్ధిలో.. అవకాశాల్లో.. మెరుగైన ప్రజా జీవనంలో మిగతా ప్రపంచం అంతా ఒక ఎత్తు.. అమెరికా ఒక ఎత్తు అంటుంటారు. అలాంటి అగ్రరాజ్యం ఇప్పుడు కొవిడ్‌ ఒమైక్రాన్‌ వేరియంట్‌ కోరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొత్త ఏడాది ప్రారంభంలో వైరస్‌ మంచు తుపానులా విరుచుకుపడుతుందని నిపుణులు అంచనా వేస్తే, అంతకుమించి.. సునామీలా చుట్టేస్తోంది. సోమవారం ఒక్క రోజే అమెరికాలో 10.40 లక్షల మంది వైరస్‌ బారినపడ్డారు. ఇప్పటివరకు ఏ దేశంలోనూ ఇంత అతి భారీ సంఖ్యలో కేసులు రాలేదు. అంతేకాదు.. భయంకర డెల్టా వేరియంట్‌ ఉధృతి కొసాగుతున్న సమయంలో, గత ఏడాది మే 7న అమెరికా మినహా అన్ని దేశాల్లో నమోదైన పాజిటివ్‌లు 4.14 లక్షలు. ప్రస్తుతం అగ్రరాజ్యంలో వచ్చిన కేసులు అంతకు రెండున్నర రెట్లు. దీన్నిబట్టే అక్కడ ఒమైక్రాన్‌ వ్యాప్తి ఏ స్థాయిలో సాగుతోందో తెలుస్తోంది. వారూ వీరని తేడా లేకుండా అన్ని రంగాల సిబ్బందీ వైర్‌సకు గురవుతుండడంతో ప్రజా జీవనం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.. అత్యవసర పరిస్థితి ఆదేశాలు జారీ అవుతున్నాయి.. విద్యా సంస్థలు మళ్లీ ఆన్‌లైన్‌ తరగతులకు మళ్లుతున్నాయి.. వేలాది విమానాలు రద్దవుతున్నాయి..! ఆఖిరుకు  న్యూ ఓర్లీన్స్‌ వంటి కొన్నిచోట్ల పారిశుధ్య కార్మికులూ దొరకడం లేదు. పెద్ద, చిన్న తేడా లేకుండా   అన్ని రంగాలు సిబ్బంది కొరత ఎదుర్కొంటున్నాయి.


నిపుణులు చెప్పినట్లే..

వాస్తవానికి అమెరికాలో జనవరిలో కొవిడ్‌ మంచు తుఫానులా విరుచుకుపడుతుందని నిపుణులు హెచ్చరికలు చేశారు. దీనికి సూచనగా గత శుక్రవారం 5.90 లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. తర్వాతి రోజుల్లో కొద్దిగా తగ్గినా.. కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో సోమవారం అమాంతం పెరిగాయి. వీరంతా ఇళ్లకే పరిమితం అయితే ప్రజా జీవనం స్తంభించిపోతుందని.. లక్షణాలు లేనివారికి ఐసొలేషన్‌ వ్యవధిని ప్రభుత్వం పది రోజుల నుంచి ఐదు రోజులకు కుదించింది. ఇక గతేడాది వైరస్‌ తీవ్రంగా ఉన్న సమయంలో ఆస్పత్రుల్లో చేరినవారి గరిష్ఠ సంఖ్యకు.. ఇప్పుడు ఒమైక్రాన్‌ ప్రారంభ దశలోనే ఆస్పత్రుల పాలవుతున్నవారి సంఖ్య దాదాపు దగ్గరగా ఉంది. న్యూజెర్సీ వంటి చోట్ల కేసులు 2 వారాల్లో ఐదారు రెట్లు పెరిగాయి. ఆర్కాన్సస్‌, న్యూయార్క్‌, మేరీల్యాండ్‌లోనూ ఇదే పరిస్థితి. పిల్లలు వైర్‌సకు గురవుతుండడంతో ఆస్పత్రుల్లో చేరికలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.  


ఇలాగైతే.. ఆర్థిక వ్యవస్థ కుదేలే!

అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ కొవిడ్‌తో అల్లాడుతోంది. ఇక్కడ పాజిటివ్‌ రేటు ఎప్పుడో 20 దాటేసింది. సిబ్బంది వైర్‌సకు గురవడంతో.. మెట్రో రైల్‌ సర్వీసులను రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పదేపదే వైరస్‌ దాడితో వైద్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మేరీల్యాండ్‌ వంటిచోట్ల సేవలందిచేందుకు ఆరోగ్య సిబ్బంది కరువవుతున్నారు. లక్షణాలు స్వల్పంగా ఉన్న సిబ్బంది విధులు నిర్వహించా ల్సిందేనంటూ రోడ్‌ఐలాండ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి ఆదేశాలిచ్చింది. ఇక ఒహియోలో వైద్య సిబ్బంది కొరతను ఎదుర్కొనడానికి 1,250 మంది నేషనల్‌ గార్డ్‌ మెంబర్స్‌ను రంగంలోకి దించారు. సిన్సినాటి నగరంలో అగ్నిమాపక సిబ్బంది కొవిడ్‌ బారినపడడంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఒమైక్రాన్‌ పూర్తిగా వ్యాపించిందని.. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ షట్‌డౌన్‌ ప్రమాదం ముంగిట ఉందని బ్రౌన్‌ యూనివర్సిటీ ఎమర్జెన్సీ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మేగాన్‌ ర్యానీ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. 


రెక్కలు విరిగిన విమానయాన రంగం

సెలవుల సీజన్‌లో కిటకిటలాడాల్సిన అమెరికా విమానయాన రంగం ఒడిదొడుకుల్లో ఉంది. పైలట్లు, సిబ్బందికి పాజిటివ్‌గా తేలుతుండడంతో వేలాది సర్వీసులు రద్దవుతున్నాయి.  కొత్త ఏడాది వేడుకల కోసం వెళ్లి, తిరుగు ప్రయాణమవుతున్న వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సోమవారం అమెరికాలో 1,900 పైగా సర్వీసులు నిలిచిపోయాయి. 


స్కూళ్లు, కార్యాలయాల ప్రారంభం వాయిదా

క్రిస్మస్‌, కొత్త ఏడాది సెలవుల అనంతరం సోమవారం నుంచి అమెరికా వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం కావల్సి ఉంది. కానీ, ఒమైక్రాన్‌ ధాటితో ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో చికాగో, డెట్రాయిట్‌, విస్కాన్సిన్‌, న్యూయార్క్‌ తదితరచోట్ల యాజమాన్యాలు అకస్మాత్తుగా సెలవులను పొడిగించాయి. మరికొన్ని ఆన్‌లైన్‌ క్లాసులు చేపట్టాయి. డావెన్‌పోర్ట్‌లో విద్యార్థులను తీసుకొచ్చేందుకు బస్సు డ్రైవర్లు లేక తరగతులను రద్దు చేశారు.  అమెరికాలో ఈ స్థాయిలో కేసులకు మరో కారణం ప్రజలు ‘హోం టెస్టింగ్‌ కిట్‌’లను వినియోగిస్తుండడమే అని తెలుస్తోంది.  . కాగా, ఎవరిలోనూ వ్యాధి తీవ్రత లేకపోవడం, మరణాలు పెరగకపోవడం ఊరటనిచ్చే అంశం. అధ్యక్షుడు బైడెన్‌ బుధవారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా, అమెరికాలో 12 -15 ఏళ్ల వయసు పిల్లలకు బూస్టర్‌ ఇచ్చేందుకు సీడీసీ ఆమోదం తెలిపింది. 5-11 ఏళ్ల వారికీ టీకా పంపిణీ చేయనున్నారు.


యూకేలో 2.18 లక్షల కేసులు

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో మంగళవారం ఎన్నడూ లేనంతగా  2.18 లక్షల కేసులు వచ్చాయి. ఆస్పత్రుల్లో చేరికలూ పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియా న్యూ సౌత్‌వేల్స్‌ రాష్ట్రంలో మంగళవారం 23 వేల కేసులు వచ్చాయు. పాజిటివిటీ 28గా ఉండడం గమనార్హం.


ఒక్కో దేశంలో ఒక్కోలా.. డబ్ల్యూహెచ్‌వో  

ఒమైక్రాన్‌ ఉధృతి ఒక్కో దేశంలో ఒక్కో స్థాయిలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  కొవిడ్‌ విభాగం పర్యవేక్షక అధికారి డాక్టర్‌ ఆబ్ది మహమూద్‌ అన్నారు. దక్షిణాఫ్రికాలో ఒమైక్రాన్‌తో ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్య, మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని, అమెరికా సహా పలు దేశాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. 128 దేశాలు ఈ వేరియంట్‌ కేసులను నిర్ధారించాయని గుర్తుచేశారు. శ్వాస వ్యవస్థ ఎగువ భాగాన్ని మాత్రమే ఒమైక్రాన్‌ లక్ష్యంగా చేసుకుంటోందన్నారు. 

95.4: అమెరికా కేసుల్లో ఒమైక్రాన్‌ శాతం(డిసెంబరు 11న ఇది 8 శాతమే)గత వారం ప్రతి వందమందిలో ఒకరికి వైరస్‌

1.02 లక్షలు : ఆస్పత్రుల్లో చేరినవారు(గత వారానికి వీరు 70 వేలే)

19 వేలు : ఐసీయూలో ఉన్నవారు

500 : రోజూ ఆస్పత్రుల్లో చేరుతున్న పిల్లలు


Updated Date - 2022-01-05T13:13:30+05:30 IST