అమెరికాలో ఒక్కరోజే 60వేల కేసులు.. 30లక్షలు దాటిన బాధితుల సంఖ్య!

ABN , First Publish Date - 2020-07-09T06:46:54+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. గత కొద్ది రోజులుగా అమెరికాలో రికార్డు స్థాయిలో కొవిడ్-19కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24

అమెరికాలో ఒక్కరోజే 60వేల కేసులు.. 30లక్షలు దాటిన బాధితుల సంఖ్య!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. గత కొద్ది రోజులుగా అమెరికాలో రికార్డు స్థాయిలో కొవిడ్-19కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో అమెరికాలో 60వేల కేసులు నమోదైనట్లు జాన్స్ హాప్కిన్స్‌ యూనివర్సిటీ ట్రాకర్ బుధవారం వెల్లడించింది. అమెరికాలో ఇంత భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 30లక్షలు దాటింది. మహమ్మారి కారణంగా అమెరికాలో 1.31 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంపట్ల గతంలో పలుమార్లు స్పందించిన ట్రంప్.. ఎక్కవ మొత్తంలో టెస్టులు చేస్తున్నందువల్లే..  అత్యధిక కేసులు నమోదవుతున్నాయన్నారు. కాగా.. భవిష్యత్తులో  అమెరికాలో రోజుకు లక్ష కరోనా కేసులు నమోదవుతాయని వైద్యనిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో అమెరికాలో 60వేల కరోనా కేసులు నమోదవ్వడంపట్ల.. ఆ దేశ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1.20కోట్లకు చేరగా.. 5.48లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-07-09T06:46:54+05:30 IST