అమెరికాలో వెయ్యి దాటిన మృతుల సంఖ్య

ABN , First Publish Date - 2020-03-27T08:37:33+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. గురువారంతో 22 వేల మందిపైనే మృతి చెందారు. వైరస్‌ రోగుల సంఖ్య పోటెత్తుతుండటంతో

అమెరికాలో వెయ్యి దాటిన మృతుల సంఖ్య

  • ఇటలీలో 8 వేలు, స్పెయిన్‌లో 4 వేలు
  • ప్రపంచవ్యాప్తంగా 22 వేలకు..
  • 5 లక్షలను మించిన పాజిటివ్‌ కేసులు
  • మలేసియా రాజ దంపతుల క్వారంటైన్‌


వాషింగ్టన్‌, న్యూయార్క్‌, లండన్‌, మార్చి 26: ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. గురువారంతో 22 వేల మందిపైనే మృతి చెందారు. వైరస్‌ రోగుల సంఖ్య పోటెత్తుతుండటంతో అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)ల్లో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. కేసులు 75వేలు మించడంతో అమెరికాలో అయితే మూసివేసినవాటిని సైతం తిరిగి తెరుస్తున్నారు. న్యూయార్క్‌ నగరంలో సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌ను తాత్కాలిక ఆసుపత్రి చేశారు. లూసియానాలో పార్కులను ఐసోలేషన్‌ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. బ్రిటన్‌ రాజధాని లండన్‌లో ఓ సమావేశ మందిరాన్ని 4 వేల పడకల ఆసుపత్రిగా మార్చేశారు. ఫిలిప్పీన్స్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రులు నిండిపోతుండటం, రక్షణ సామగ్రి లేకపోవడంతో  దేశంలో 9 మంది వైద్యులు మృతి చెందారని అధికారులు తెలిపారు.  


భారత సంతతి బాలికకు వైరస్‌

వాటికన్‌లోని క్రైస్తవ మత పెద్ద పోప్‌ నివాస గృహ ఉద్యోగికి వైరస్‌ సోకింది. సింగపూర్‌లో భారత సంతతి బాలిక (3) వైర్‌సకు గురైంది. రాజ ప్రాసాదంలోని ఏడుగురు ఉద్యోగులు కొవిడ్‌ బారినపడటంతో మలేసియా రాజ దంపతులు స్వీయ క్వారంటైన్‌కు వెళ్లారు. ఇటలీలో గత నెల రోజుల్లో 67 మంది మత గురువులు చనిపోయారు. స్పెయిన్‌లో రోజు వ్యవధిలో మరో 665 మంది మృతి చెందారు. ఇటలీలో మృతుల సంఖ్య 8 వేలకు చేరింది. చైనాలో కొత్త కేసులేమీ నమోదు కాలేదు. 


డబ్ల్యూహెచ్‌వో తీరుపై ట్రంప్‌ గుర్రు

కరోనా సంక్షోభం విషయంలో డబ్ల్యూహెచ్‌వో పూర్తిగా చైనాను వెనకేసుకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మండిపడ్డారు. ఈ విషయం లో సంస్థ తీరుపై చాలామందికి అసంతృప్తి ఉందన్నారు. కరోనాపై సమరంలో జి-20 దేశాల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక అనిశ్చితి నివారణకు ప్రపంచ మార్కెట్లోకి 5 ట్రిలియన్‌ డాలర్లను జొప్పించనుంది.


దేశాల్లో మరణాలు

అమెరికా 1,080

ఇరాన్‌ 2,234

స్పెయిన్‌ 4,145

ఇటలీ 8,165

ఫ్రాన్స్‌ 1,331

చైనా 3,287

యూకే 477

Updated Date - 2020-03-27T08:37:33+05:30 IST