ట్రంప్‌ అభిశంసన!

ABN , First Publish Date - 2021-01-14T07:05:57+05:30 IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను అభిశంసించేందుకు ప్రతినిధుల సభ సిద్ధమైంది.దేశ ప్రజాస్వామ్య సౌధంపై దాడిని, హింసా విధ్వంసాలను రెచ్చగొట్టిన నేరానికి ఆయనను

ట్రంప్‌ అభిశంసన!

సాధారణ మెజారిటీతో దిగువసభ ఆమోదానికి రంగం సిద్ధం

చరిత్రలో రెండుమార్లు మచ్చ పడ్డ తొలి అధ్యక్షుడు

అభిశంసన ఉత్తుత్తిదే: ట్రంప్‌


వాషింగ్టన్‌, జనవరి 13: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను అభిశంసించేందుకు ప్రతినిధుల సభ సిద్ధమైంది.దేశ ప్రజాస్వామ్య సౌధంపై దాడిని, హింసా విధ్వంసాలను రెచ్చగొట్టిన నేరానికి ఆయనను అభిశంసిస్తున్నట్లు ప్రతినిధుల సభ ఇప్పటికే ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుఝామున ఓటింగ్‌ జరగనుంది. పార్టీల బలాబలాల ప్రకారమే ఫలితం ఉంటుంది. డెమాక్రాట్ల బలం 215. ఐదుగురు రిపబ్లికన్లు కూడా ఈ తీర్మానానికి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే 220 మంది. తీర్మానం నెగ్గడానికి సాధారణ మెజారిటీ చాలు. డెమొక్రాట్లకు స్పష్టమైన ఆధిక్యం ఉన్నందున తీర్మానం దిగువసభ ఆమోదం పొందడం లాంఛనప్రాయమే. దీంతో అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసనకు గురైన అధ్యక్షుడిగా.. అదీ ఒకే టర్మ్‌లో.. ట్రంప్‌ నిలిచిపోయారు. సెనెట్‌లో దీనికి ఆమోదముద్ర లభిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే దిగువ సభలోనైనా ఈ మచ్చ పడడం ట్రంప్‌ ఆధ్యక్షం లో ఓ చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది.


2019లో ఉక్రెయిన్‌కు 400 మిలియన్‌ డాలర్ల సాయం అందించేందుకు తన రాజకీయ ప్రత్యర్థి జో బైడెన్‌పై క్రిమినల్‌ కేసులు బనాయించాలని ట్రంప్‌ కోరడం నాడు ఆయన అభిశంసనకు దారితీసింది. అప్పట్లో ప్రతినిధుల సభ 3 నెలల పాటు విచారణ జరిపి ఆమోదించింది. ఈ సారి మాత్రం ఒక్క రోజులోనే ఈ తంతు పూర్తి చేసింది. అభిశంసన తీర్మానం ప్రతినిధుల సభలో ఆమో దం పొందినా ట్రంప్‌ పదవిలోనే కొనసాగుతారు. ప్రతినిధుల సభ పంపిన అభిశంసన తీర్మానాన్ని ఎగువసభ సెనెట్‌ కూడా మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుం ది. ప్రస్తుతం సెనెట్‌లో రిపబ్లికన్లకే ఆధిక్యత ఉంది. కనీసం 17 మంది రిపబ్లికన్‌ సెనేటర్లు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తేనే ఆమోదముద్ర పొందుతుంది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంతమంది ఓటు చేస్తారా అన్నది సందేహమే. అంతకంటే ముందు తీర్మానంపై సెనెట్‌ విచారణ చేపట్టేందుకే సమయం లేదు. 19వ తేదీన సమావేశం కానున్న సెనెట్‌ ఒక్క రోజులో దీన్ని పూర్తి చేయడం అసాధ్యం. 20న జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేశాక కూడా సెనెట్‌ దీన్ని కొనసాగించదలిస్తే అప్పుడు సమీకరణాలు వేరుగా ఉంటాయి. అప్పటికి డెమొక్రాట్లకు సెనెట్‌లో ఒక్క ఓటు ఆధిక్యత లభిస్తుంది.


ఈ అభిశంసనకు ముందు ప్రతినిధుల సభ మరో తీర్మానం ఆమోదించింది. రాజ్యాంగం 25వ సవరణను వినియోగించి ట్రంప్‌ను తక్షణం పదవీచ్యుతుణ్ని చేయాల్సిందిగా ఉపాధ్యక్షు డు మైక్‌ పెన్స్‌ను, కేబినెట్‌ను సభ కోరింది. మరో వారంలోగా ఎటూ నిష్క్రమిస్తున్నందున ఆఘమేఘాల మీద ఆయనను దింపేయాల్సిన అగత్యం లేదని పెన్స్‌ ఇప్పటికే తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌ నాన్సీ పెలోసీకి లేఖ రాసినా ప్రతినిధుల సభ ఈ తీర్మానం చేయడం విశేషం. ‘అధికారాన్ని సం పాదించడానికో లేక శిక్ష విధించడానికో ఈ సవరణను ప్రయోగించడం సరికాదు. దీన్ని ఉపయోగిస్తే అది ఓ తీవ్రమైన దృష్టాంతంగా, ఓ చెడ్డ ఉదాహరణగా మిగిలిపోతుంది’ అని పెన్స్‌ తన లేఖలో పేర్కొన్నారు. అయితే పెలోసీ మాత్రం దేశానికి ఓ సంకేతం పంపడానికైనా ఈ చర్య అవసరమని గట్టిగా అభిప్రాయపడ్డారు. ‘విద్రోహకర దాడికి ట్రంప్‌ పురిగొల్పిన మాట వాస్తవం. వాషింగ్టన్‌కు ఆరో తేదీకల్లా రావాల్సిందిగా ఆయన అనేక రోజుల ముందు నుంచీ మద్దతుదారులకు పిలుపునిచ్చారు.


వారు వచ్చాక ర్యాలీని ఉద్దేశించి మాట్లాడి.. కేపిటల్‌పై విరుచుకుపడాలని రెచ్చగొట్టారు. కాంగ్రెస్‌ ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. అల్లరిమూకను, తీవ్రవాదులను ఉసిగొల్పారు. ఈ హింసా విధ్వంసాలను ఆయన, ఆయన కుటుంబం సెలిబ్రేట్‌ చేసుకున్నారు. ఇప్పుడేమో తాను హింసను ప్రోత్సహించలేదని, ఆ దాడితో తనకు సంబంధమే లేదని నమ్మబలుకుతున్నారు. ఇలాంటి వ్యక్తి ఇంకా శ్వేతసౌధంలో కొనసాగడానికి అర్హుడు కాదు’ అని ఆమె ఘాటుగా అన్నారు.  తీర్మానానికి అనుకూలంగా 223 ఓట్లు రాగా వ్యతిరేకంగా 205 ఓట్లు పడ్డాయి. కాగా, అనేకమంది రిపబ్లికన్లు ట్రంప్‌ నిష్క్రమణను కోరుకుంటున్నట్లు వార్తాకథనాలు సూచిస్తున్నాయి. 2024లో పోటీకి తాను సిద్ధమని ట్రంప్‌ సంకేతాలనిచ్చినా ఆమోదించడానికి వారు సిద్ధంగా లేరని తెలుస్తోంది.


పశ్చాత్తాపం లేని ట్రంప్‌! 

ఓ పక్క దిగువసభ తనపై అభిశంసన ముద్ర వేసే ఆర్టికల్‌పై చర్చ జరుపుతున్న సమయంలో  ట్రంప్‌ దేశ దక్షిణ సరిహద్దుల్లో మెక్సికో గోడ నిర్మాణాన్ని చూడడానికి వెళ్లారు. టెక్స్‌సలో మీడియాతో మాట్లాడిన ఆయన- ఈ అభిశంసన ఉత్తుత్తిదేనని కొట్టి పారేశారు. దేశాన్ని నిలువునా చీల్చేందుకు డెమొక్రాట్లు ఈ విషపూరితమైన కక్షసాధింపుకు దిగారన్నారు. ‘25వ సవరణ వల్ల నాకేమీ ముప్పు లేదు. కానీ బైడెన్‌ను అది వెంటాడి తీరుతుంది. ఇది తథ్యం’ అని వ్యాఖ్యానించారు. కేపిటల్‌ దాడిపై ఆయన ఎలాంటి పశ్చాత్తాపాన్నీ వ్యక్తం చేయలేదు.  ‘హింసను నేనెన్నడూ ప్రోత్సహించలేదు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నేను. ఇది దేశప్రజలందరికీ తెలుసు. అమెరికన్‌ ప్రయోజనాలు ఎవరు కాపాడగలరో ప్రజలకు తెలుసు’ అని ఆయన చెప్పుకొచ్చారు.


నిషేధించిన యూట్యూబ్‌ 

ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టా, స్నాప్‌చాట్‌, ట్విచ్‌ .. మొదలైన సామాజిక మాధ్యమాలు ట్రంప్‌ ఖాతాలను నిషేధించగా - తాజాగా గూగుల్‌ కూడా ఆ వరుసలో చేరింది. గూగుల్‌ చేతిలో ఉన్న యూట్యూబ్‌ - ట్రంప్‌ చానెల్‌ను తాత్కాలికంగా నిలిపేసింది. హింసను ప్రేరేపించే కంటెంట్‌ను ట్రంప్‌ చానెల్‌ ప్రమోట్‌ చేస్తున్నందున వారం పాటు నిషేధించినట్లు యూట్యూబ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అటు టిక్‌ టాక్‌ కూడా ట్రంప్‌పై నిషేధం విధించింది. ట్రంప్‌ ప్రసంగాల వీడియోలు, ఆడియో, ఇతర స్టేట్‌మెంట్లన్నింటినీ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 

Updated Date - 2021-01-14T07:05:57+05:30 IST