Delta Variant: దేశ ప్ర‌జ‌ల‌కు బైడెన్ వార్నింగ్‌..!

ABN , First Publish Date - 2021-06-19T19:33:39+05:30 IST

శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతున్న క‌రోనా డెల్టా వేరియంట్‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అమెరికా ప్ర‌జ‌ల‌ను అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చ‌రించారు.

Delta Variant: దేశ ప్ర‌జ‌ల‌కు బైడెన్ వార్నింగ్‌..!

ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా టీకా తీసుకోవాల‌ని సూచ‌న‌!

వాషింగ్ట‌న్‌: శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతున్న క‌రోనా డెల్టా వేరియంట్‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అమెరికా ప్ర‌జ‌ల‌ను అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చ‌రించారు. ప్రాణాంత‌క‌మైన ఈ వేరియంట్ ముప్పు నుంచి త‌ప్పించుకోవాలంటే సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని అన్నారు. శుక్ర‌వారం వైట్‌హౌస్ వ‌ద్ద మీడియాతో మాట్లాడిన బైడెన్‌.. "టీకా వేయించుకోని వారిపై డెల్టా వేరియంట్ మ‌రింత ప్ర‌భావం చూపించే వీలుంది. ఇది చాలా డేంజ‌ర‌స్‌. దీన్నుంచి త‌ప్పించుకునేందుకు వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వేరియంట్ శ‌ర‌వేగంగా వ్యాపిస్తుంద‌ని, ప్రాణాంత‌క‌మైన‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది యువ‌తకు మ‌రింత డేంజ‌ర‌స్" అని అన్నారు. ఇక అమెరికా వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంద‌ని చెప్పిన బైడెన్‌.. గ‌డిచిన 150 రోజుల్లో 300 మిలియ‌న్ డోసుల టీకాల పంపిణీ చేసిన‌ట్లు తెలిపారు. అటు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్ల్యూహెచ్ఓ) సైతం డెల్టా వేరియంట్‌ను వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ట్లు గుర్తించింది. మొద‌ట భార‌త్‌లో వెలుగుచూసిన ఈ వేరియంట్ ఇప్ప‌టివ‌ర‌కు 80కి పైగా దేశాల‌కు ప్ర‌బ‌లింద‌ని డ‌బ్ల్యూహెచ్ఓ వెల్ల‌డించింది. ఇండియాలో గ‌తేడాది అక్టోబర్‌లో డెల్టా వేరియంట్ బ‌య‌ట‌ప‌డింద‌ని పేర్కొంది.       

Updated Date - 2021-06-19T19:33:39+05:30 IST