భారత్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు.. రష్యా విషయంలో జంకుతుందంటూ..

ABN , First Publish Date - 2022-03-23T12:54:26+05:30 IST

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం ముదురుతున్న కొద్దీ.. శాంతిని నెలకొల్పేందుకు అగ్రరాజ్యం అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది.

భారత్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు.. రష్యా విషయంలో జంకుతుందంటూ..

ఉక్రెయిన్‌పై దాడిని మా మిత్రపక్షాలన్నీ వ్యతిరేకించాయి

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వ్యాఖ్యలు

పుతిన్‌ యుద్ధ నేరగాడని వ్యాఖ్య.. ఖండించిన రష్యా

కీవ్‌, ఖార్కివ్‌లో కొనసాగుతున్న రష్యా విధ్వంసం

ప్రధాని మోదీకి బోరిస్‌ జాన్సన్‌ ఫోన్‌

శరణార్థుల కోసం రష్యా జర్నలిస్టు ‘నోబెల్‌’ త్యాగం

నేడు ఉక్రెయిన్‌పై ఐరాస ప్రత్యేక భేటీ

కీవ్‌/వాషింగ్టన్‌/మాస్కో, మార్చి 22: ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం ముదురుతున్న కొద్దీ.. శాంతిని నెలకొల్పేందుకు అగ్రరాజ్యం అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో.. ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్‌-- భారత్‌ వణుకుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా నాటో సభ్యత్వం విషయంలో తన నిర్వేదాన్ని వెలిబుచ్చారు. అటు ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌, సముద్ర తీర నగరం మారియుపోల్‌, రష్యా సరిహద్దుల్లో ఉన్న ఖార్కివ్‌లో మంగళవారం కూడా రష్యా భీకర దాడులు కొనసాగాయి. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను తమ మిత్రపక్షాలన్నీ ఖండిస్తున్నాయని.. భారత్‌ మాత్రం తటస్థంగా ఉంటోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ‘‘మాస్కోపై చర్యలకు భారత్‌ ఎందుకో వణుకుతున్నట్లుగా.. బలహీనంగా కనిపిస్తోంది. అస్థిరంగా, బలహీనంగా స్పందిస్తోంది. తటస్థంగా ఉంటోంది’’ అని వ్యాఖ్యానించారు.


సీఈవోలతో జరిగిన బిజినెస్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పుతిన్‌ విభజన లెక్కలు వేసుకున్నారు. ఆ లెక్క తప్పింది. నాటో కూటమి ఐక్యంగా.. చరిత్రలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. నాటో, ఐరోపా సమాఖ్య దేశాలన్నీ రష్యాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. క్వాడ్‌ కూటమిలోనూ భారత్‌ మినహా.. తమతోపాటు జపాన్‌, ఆస్ట్రేలియా రష్యాపై ఒత్తిడి తెస్తున్నాయి’’ అని అన్నారు. పుతిన్‌ను యుద్ధ నేరగాడిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలను రష్యా ఖండించింది. రష్యాలోని అమెరికా రాయబారిని అధికారవర్గాలు పిలిపించుకుని, మందలించాయి. అటు, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. ఉక్రెయిన్‌ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నాటోపై నిర్వేదంగా మాట్లాడారు. ‘‘నాటో కూటమిలో మమ్మల్ని చేర్చుకునేందుకు అంగీకరించాలి. లేదంటే.. రష్యాకు భయపడే తమ సభ్యత్వం నిర్ణయం తీసుకోలేకపోతున్నామని బహిరంగంగా ఒప్పుకోవాలి’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే జెలెన్‌స్కీ పలు సందర్భాల్లో నాటోలో చేరేది లేదని, ఆ విషయం ఉక్రెయినన్లు ఇప్పుడిప్పుడే గుర్తించారని పేర్కొన్నారు. 


జోరు పెంచిన రష్యా.. 

ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభమై 26 రోజులు దాటినా.. రష్యా ఎక్కడా పైచేయి సాధించలేకపోయింది. పైగా.. 15,300 మంది రష్యా సైనికులు హతమైనట్లు ఉక్రెయిన్‌ తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాడి తొలినాళ్లలో మాదిరిగా వైమానిక దళానికి పనిచెప్పాలనే యోచనలో పుతిన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో 300 యుద్ధ విమానాలను సిద్ధం చేసింది.


కీవ్‌, మారియుపోల్‌ నగరాల్లో రష్యా మంగళవారం భీకరదాడులకు పాల్పడింది. కీవ్‌ సమీపంలోని బుచా, హోస్టొమెల్‌, ఇర్పిన్‌ నగరాలపై రష్యా పాక్షికంగా పట్టు సాధించింది. లుహాన్స్క్‌, డోనెట్స్క్‌ రీజియన్లలో 2,389 మంది చిన్నారులను రష్యా సైన్యం కిడ్నాప్‌ చేసిందనే ఆరోపణలను అమెరికా నిర్ధారించింది. రష్యా వారిని తరలించడం యుద్ధ నిబంధనలకు విరుద్ధమంటూ ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం ట్వీట్‌ చేసింది. వారిని రష్యాకు తరలించడం మానవతాసాయం కిందకు రాదని, అది కిడ్నాపేనని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణపై ఐక్య రాజ్య సమితి(ఐరాస) సర్వసభ్య సమావేశం(జనరల్‌ అసెంబ్లీ) బుధవారం ప్రత్యేకంగా భేటీ కానుంది. 

Updated Date - 2022-03-23T12:54:26+05:30 IST