Joe Biden: ఓ పెద్దాయనా.. ఏంటిది.. అమెరికా అధ్యక్షుడి వీడియో వైరల్..

ABN , First Publish Date - 2022-09-23T02:45:53+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు(Joe Biden) సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.

Joe Biden: ఓ పెద్దాయనా.. ఏంటిది.. అమెరికా అధ్యక్షుడి వీడియో వైరల్..

ఎన్నారై డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు(Joe Biden) సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. స్టేజ్‌పై ప్రసంగం తరువాత బైడెన్ ఎటువైపు వెళ్లాలో తెలీక అగమ్యగోచరంగా ఓ చోట నిలబడిపోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. న్యూయార్క్‌ నగరంలో(Newyork) బుధవారం.. గ్లోబల్ ఫండ్ సంస్థ(Global Fund) ఏర్పాటు చేసిన ఓ కాన్ఫరెన్స్‌లో ఈ ఘటన జరిగింది. తొలుత స్టేజ్‌పైన బైడెన్ ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత.. పోడియమ్ దిగే క్రమంలో ఆయన ఎటువెళ్లాలో తెలీక కాస్తంత తికమక పడ్డట్టు కనిపించింది. స్టేజ్ చివరి వరకూ నడుచుకుంటూ వెళ్లిన ఆయన అక్కడే కొన్ని క్షణాల పాటు ఎటూ కదలకుండా నిలబడిపోయారు. ఆ తరువాత..కార్యక్రమం ముగింపు ప్రసంగం చెవిన పడటంతో తేరుకున్న బైడెన్ వెనక్కు తిరిగి అటువైపు వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 


ఈ వీడియోతో బైడెన్ ప్రత్యర్థులకు ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టేందుకు మరో అవకాశం చిక్కింది. దీంతో.. నెట్టింట్లో ప్రస్తుతం విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఓ పెద్దాయనా ఏంటి ఇది అంటూ కొందరు తుంటరి కామెంట్స్ చేశారు. ఏదో హారర్ సినిమా చూస్తున్నట్టు ఉంది అంటూ మరికొందరు ట్వీట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కాగా.. గతంలోనూ బైడెన్ తడబాటు పలుమార్లు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఓ సందర్భంలో ఆయన.. తన ఎదురుగా ఎవరూ లేకపోయినా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చేయి ముందుకు జాచడం.. పెద్ద చర్చకే దారి తీసింది. ఇక కొన్ని అధికారిక సమావేశాల్లో బైడెన్ చిన్న కునుకు తీస్తున్నట్టు కనిపించే వీడియోలూ వైరల్ అయ్యాయి. దీంతో అమెరికా మాజీ అధ్యక్షుడు, బైడెన్ రాజకీయ ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆయనను నిద్రమత్తు జో అంటూ పలుమార్లు కామెంట్ చేశారు కూడా. 


ఎయిడ్స్, మలేరియా, ట్యూబరిక్యులోసిస్ వ్యాధులపై నిర్మూలనలో భాగంగా నిధుల సమీకరణ కోసం గ్లోబల్ ఫండ్ సంస్థ(Global Fund) ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఏకంగా 14.25 బిలియన్ డాలర్లు సమీకరించినట్టు సమాచారం. ‘‘ప్రజలను కాపాడేందుకు జరుగుతున్న ఈ పోరాటంలో భాగమైనందుకు ధన్యవాదాలు’’ అని బైడెన్ సభికులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సగర్వంగా తలెత్తుకుని జీవించేలా చేసేందుకు ఇది ఓ ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు.  





Updated Date - 2022-09-23T02:45:53+05:30 IST