చరిత్రకు ఒక్క అడుగు!

ABN , First Publish Date - 2021-09-12T06:49:10+05:30 IST

టాప్‌సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌ తుది సమరానికి చేరుకున్నాడు. క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌ కలకు అడుగు దూరంలో నిలిచాడు.

చరిత్రకు ఒక్క అడుగు!

ఆదివారం రాత్రి 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

ఫైనల్లో జొకోవిచ్‌

మెద్వెదెవ్‌తో టైటిల్‌ ఫైట్‌ నేడు 

యూఎస్‌ ఓపెన్‌

న్యూయార్క్‌: టాప్‌సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌ తుది సమరానికి చేరుకున్నాడు. క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌ కలకు అడుగు దూరంలో నిలిచాడు. 1969లో రాడ్‌ లేవర్‌ తర్వాత ఈ అరుదైన అవకాశం జొకోను ఊరిస్తోంది. హోరాహోరీగా సాగిన సెమీస్‌ పోరులో ఒలింపిక్‌ చాంపియన్‌, నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌పై అద్భుత విజయం సాధించిన జొకో.. వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్‌ తుదిపోరుకు చేరుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగే టైటిల్‌ ఫైట్‌లో రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌తో నొవాక్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ టైటిళ్లను జొకో గెలిచిన సంగతి తెలిసిందే. యూఎస్‌ ఓపెన్‌ కూడా నెగ్గితే.. క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌ కల నెరవేరుతుంది. అంతే కాకుండా ఆధునిక టెన్నిస్‌లో అత్యధికంగా 21 టైటిళ్లు సాధించిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్‌లతో నడాల్‌, ఫెడరర్‌తో సమంగా జొకో ఉన్నాడు. 


ఉత్కంఠపోరులో..:

ఒలింపిక్స్‌లో జ్వెరెవ్‌ చేతిలో ఎదురైన పరాజయానికి జొకో బదులు తీర్చుకున్నాడు. శనివారం మూడున్నర గంటలపాటు సాగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ జొకో 4-6, 6-2, 6-4, 4-6, 6-2తో జర్మన్‌ స్టార్‌ జ్వెరెవ్‌పై ఐదుసెట్లపాటు పోరాడి నెగ్గాడు. టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో తొలి సెట్‌ను చేజార్చుకున్న నొవాక్‌.. సెమీ్‌సలోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత రెండుసెట్లు నెగ్గిన జొకోకు  ఝలకిస్తూ జ్వెరెవ్‌ నాలుగోసెట్‌లో పైచేయి సాధించాడు. అయితే, ఇలాంటి సమయంలోనే దీటుగా చెలరేగే నొవాక్‌.. తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి ఆఖరిసెట్‌ నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో సెమీ్‌సలో రష్యాకు చెందిన మెద్వెదెవ్‌ 6-4, 7-5, 6-2తో 12వ సీడ్‌ ఫెలిక్స్‌ అగర్‌ అలియసిమ్‌ (కెనడా)పై నెగ్గి రెండోసారి యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. 


ఎవరు గెలిచినా రికార్డే..

యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ఈసారి కొత్త చాంపియన్‌ అవతరించనుంది. టోర్నీ ఆసాంతం సంచలన విజయాలతో అదరగొట్టిన టీనేజర్లు ఎమ్మా రదుకాను (బ్రిటన్‌), లైలా అన్నె ఫెర్నాండెజ్‌ (కెనడా) మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ శనివారం అర్ధరాత్రి జరుగుతుంది. అంటే..  మనం ఉదయం లేచేసరికల్లా విజేత ఎవరన్నది తేలిపోతుంది. సెమీ్‌సలో రదుకాను 6-1, 6-4తో 17వ సీడ్‌ మరియా సక్కారిపై నెగ్గింది. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన తొలి క్రీడాకారిణిగా 18 ఏళ్ల రదుకాను రికార్డులకెక్కింది. మరో సెమీస్‌లో 19 ఏళ్ల ఫెర్నాండెజ్‌ 7-6(3), 4-6, 6-4తో 2వ సీడ్‌ సబలెంకను చిత్తుచేసి తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ తుదిపోరుకు అర్హత సాధించింది. కాగా, 1999 యూఎస్‌ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్‌, మార్టినా హింగిస్‌ మ్యాచ్‌ తర్వాత గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడుతున్న టీనేజర్లు ఫెర్నాండెజ్‌, రదుకానే కావడం విశేషం. ఎవరు గెలిచినా ఇద్దరికీ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కానుంది. 

Updated Date - 2021-09-12T06:49:10+05:30 IST