స్టార్లకు షాక్‌

ABN , First Publish Date - 2021-09-05T08:33:35+05:30 IST

యూఎస్‌ ఓపెన్‌లో పెను సంచలనాలు నమోదయ్యాయి.

స్టార్లకు షాక్‌

సిట్సిపాస్‌, రుబలేవ్‌, ఒసాక అవుట్‌

 ప్రీక్వార్టర్స్‌కు కార్లోస్‌, టియాఫో, లేలా 

యూఎస్‌ ఓపెన్‌


 న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో పెను సంచలనాలు నమోదయ్యాయి. పురుషుల సింగిల్స్‌ టాప్‌స్టార్లు స్టెఫనోస్‌ సిట్సిపాస్‌, ఆండ్రే రుబలేవ్‌, మహిళల డిఫెండింగ్‌ చాంపియన్‌ నవోమి ఒసాక, 10వ సీడ్‌ పెట్రా క్విటోవా ఓటమిపాలయ్యారు. టైటిల్‌ ఫేవరెట్‌గా భావించిన గ్రీకు వీరుడు, మూడోసీడ్‌ స్టెఫనోస్‌ సిట్సిపా్‌సకు మూడోరౌండ్లో  స్పెయిన్‌కు చెందిన 18ఏళ్ల కుర్రాడు కార్లోస్‌ అల్కరజ్‌ గరీఫీ  షాకిచ్చాడు. నడాల్‌ వారసుడిగా పరిగణిస్తున్న కార్లోస్‌ 6-3, 4-6, 7-6(2), 0-6, 7-6(5)తో సిట్సిపాస్‌కు ఝలకిచ్చాడు. రష్యాకు చెందిన ఐదోసీడ్‌ రుబలేవ్‌ 6-4, 3-6, 6-7(6), 6-4, 1-6తో అన్‌సీడెడ్‌ ఫ్రాన్సెస్‌ టియాఫో (అమెరికా) చేతిలో కంగుతిన్నాడు. 


అయ్యో.. ఒసాక:

జపాన్‌ ప్లేయర్‌, డిఫెండింగ్‌ చాంప్‌ ఒసాక అనూహ్య ఓటమిని చవిచూసింది. మూడో రౌండ్‌లో మూడో సీడ్‌ ఒసాకకు 7-5, 6-7(2), 4-6తో కెనడాకు చెందిన 18 ఏళ్ల టీనేజర్‌ లేలా అన్నె ఫెర్నాండెజ్‌  చేతిలో చుక్కెదురైంది. మ్యాచ్‌ అనంతరం కన్నీటి పర్యంతమైన ఒసాక.. మరోసారి టెన్నిస్‌ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్టు ప్రకటించింది. కుంగుబాటు కారణంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి మధ్యలోనే వైదొలిగిన నవోమి.. వింబుల్డన్‌కు దూరమైంది. అయితే, ఆమె ఇప్పుడు యూఎస్‌ ఓపెన్‌లో తలపడ్డా నిరాశే ఎదురైంది. రెండో సీడ్‌ సబలెంక 6-3, 6-3తో కొలిన్స్‌ను, స్విటోలినా 6-4, 6-2తో కసట్‌కినాను, కెర్బర్‌ 5-7, 6-2, 6-3తో స్లోన్‌ స్టీఫెన్స్‌పై గెలిచి నాలుగో రౌండ్‌కు చేరుకున్నారు. చెక్‌ భామ క్విటోవా 4-6, 3-6తో మరియా సక్కారి (గ్రీస్‌) చేతిలో ఓడింది. 


సానియా జోడీ అవుట్‌:

ఇప్పటికే మహిళల డబుల్స్‌లో ఓడిన భారత స్టార్‌ సానియా మీర్జాకు మిక్స్‌డ్‌లోనూ చుక్కెదురైంది. తొలిరౌండ్‌లో సానియా-రాజీవ్‌ రామ్‌ (అమెరికా) జోడీ 3-6, 6-3, 7-10తో ఉక్రెయిన్‌-ఆస్ట్రేలియా జంట డయానా-మ్యాక్స్‌ పర్సల్‌ చేతిలో పరాజయం పాలైంది. 

Updated Date - 2021-09-05T08:33:35+05:30 IST