అమ్మల జైత్రయాత్ర

ABN , First Publish Date - 2020-09-09T09:32:24+05:30 IST

ప్రతిష్ఠాత్మక యూఎస్‌ ఓపెన్‌లో మమ్మీ త్రయం హవా సాగుతోంది. ఇప్పటికే వెటరన్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రవేశించగా..

అమ్మల జైత్రయాత్ర

క్వార్టర్స్‌లో పిరొంకోవా, అజరెంకా, సెరెనా.

పురుషుల్లో థీమ్‌, మెద్వెదేవ్‌

కెనిన్‌ అవుట్‌ 

యూఎస్‌ ఓపెన్‌


న్యూయార్క్‌: ప్రతిష్ఠాత్మక యూఎస్‌ ఓపెన్‌లో మమ్మీ త్రయం హవా సాగుతోంది. ఇప్పటికే వెటరన్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రవేశించగా.. మరో ఇద్దరు అమ్మలు స్వెతానా పిరొంకోవా (బల్గేరియా), విక్టోరియా అజరెంకా (బెలారస్‌) కూడా తుది ఎనిమిది మంది జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇలా.. ఒకేసారి ముగ్గురు అమ్మలు సింగిల్స్‌లో క్వార్టర్స్‌ చేరడం గ్రాండ్‌స్లామ్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక.. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకరైన ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత, రెండోసీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా)కు ప్రీక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా), మూడో సీడ్‌ ఆండ్రీ మెద్వెదేవ్‌ (రష్యా) దూకుడు కొనసాగిస్తూ క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో బెల్జియంకు చెందిన ఎలిస్‌ మెర్టెన్స్‌ 6-3, 6-3తో కెనిన్‌ను చిత్తు చేసింది. ఇక మూడు గంటల పోరాటంలో అన్‌సీడెడ్‌ పిరొంకోవా 6-4, 6-5, 6-3తో అలిజె కార్నెట్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచింది. 2017 వింబుల్డన్‌తో చివరిసారి గ్రాండ్‌స్లామ్‌ ఆడిన పిరొంకోవా తాజా విజయంతో కెరీర్‌లో తొలిసారి మేజర్‌ టోర్నీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మూడేళ్ల మెటర్నిటీ విరామం తర్వాత బరిలోకి దిగిన పిరొంకోవా.. గతరౌండ్లలో స్టార్లు ముగురుజ, వెకిక్‌లను ఓడించి సత్తా చాటుకుంది. మాజీ నెంబర్‌వన్‌ అజరెంకా 5-7, 6-1, 6-4తో కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై నెగ్గి నాలుగేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్స్‌కు చేరింది. తొలి సెట్‌లో అజరెంకా సర్వీ్‌సను మూడుసార్లు బ్రేక్‌ చేస్తూ ముకోవా పైచేయి సాధించింది. ఆ తర్వాత రెండు సెట్లలో మాత్రం అజరెంకా హవా ముందు నిలవలేకపోయింది. 


బోపన్న నిష్క్రమణ..

యూఎస్‌ ఓపెన్‌లో భారత పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో రోహన్‌ బోపన్న-షపోవలోవ్‌ (కెనడా) ద్వయం 5-7, 5-7తో జూలియన్‌ రోజర్‌-టెకావు (అమెరికా) చేతిలో వరుస సెట్లలో ఓటమిపాలైంది.

Updated Date - 2020-09-09T09:32:24+05:30 IST