తీవ్ర పరిణామాలు తప్పవని చైనాకు అమెరికా హెచ్చరిక

ABN , First Publish Date - 2022-03-14T18:22:15+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలై 19వ రోజుకు చేరుకున్నప్పటికీ నాటో అందిస్తున్న సాయం కారణంగానే ..

తీవ్ర పరిణామాలు తప్పవని చైనాకు అమెరికా హెచ్చరిక

వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలై 19వ రోజుకు చేరుకున్నప్పటికీ నాటో అందిస్తున్న సాయం కారణంగానే ఉక్రెయిన్‌పై పట్టు సాధించలేకపోతున్నామని భావిస్తున్న రష్యా.. తాజాగా చైనాను సాయం అర్థించడంపై అమెరికా కన్నెర్ర చేసింది. రష్యాకు మిలటరీ సాయం కానీ, ఆర్థిక సాయం కానీ చేసిన పక్షంలో తీవ్ర పరిణామాలను డ్రాగెన్‌ దేశం ఎదుర్కోవలసి వస్తుందని చైనాను సోమవారంనాడు హెచ్చరించింది. ఇదే జరిగితే చైనాపై ఆర్థిక ఆంక్షలతో పాటు మరిన్ని కఠిన ఆంక్షలు విధించాల్సి వస్తుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు జాక్ సులివాన్ హెచ్చరించారు. చైనా దౌత్యవేత్త యాంగ్ జీచి‌తో ఆయన రోమ్‌లో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బలమైన ఆర్థిక వ్యవస్థలు కలిగిన రెండు దేశాలు పరస్పర సహకరించుకోవాలనే అంశంతో పాటు తాజాగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంశం కూడా ఉభయుల సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఉంది.


రష్యా అప్రతిహతంగా ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతుండటంతో ఆదివారంనాడు సుమారు 600 మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని అమెరికా చెబుతోంది. ఇందుకు ప్రతిగా అమెరికా సారథ్యంలోని పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలను తీవ్రతరం చేస్తూ పోతున్నాయి. మరోవైపు, రష్యాకు మిత్రదేశమైన చైనా తమ రెండు దేశాల మధ్య సంబంధాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయనే ప్రకటన చేయడం, రష్యాపై ఎలాంటి ఆంక్షలకు దిగకపోవడంపై అమెరికా గుర్రుమంటోంది. శాంతిదూతగా మధ్యవర్తిత్వాన్ని నడిపేందుకు సిద్ధమంటున్న చైనా ఇదే సమయంలో రష్యాకు ఆయుధాలు, ఆర్థిక సహాయం అందజేస్తే మాత్రం ఊరుకునేది లేదని కరాఖండిగా ప్రకటించింది.


తాజా పరిణాలపై సులివాన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌పై రష్యా దాడి జరపనుందనే విషయం పాక్షికంగానైనా చైనాకు ముందే తెలుసునని అమెరికా నమ్ముతోందన్నారు. అయినప్పటికీ దూరదృష్టి లేకుండా చైనా వ్యవహరిస్తోందని ఆరోపించారు. యుద్ధం కొనసాగుతున్నందున చైనా చర్యలను అమెరికా నిశితంగా గమనిస్తోందని, రష్యాకు ఎలాంటి ఆయుధ సాయం అందించినా తగిన మూల్యం చెల్లించేందుకు చైనా సిద్ధం కావాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.


చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గతవారం మీడియాతో మాట్లాడుతూ, చైనాతో తమ సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని, ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయడానికి బీజింగ్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

Updated Date - 2022-03-14T18:22:15+05:30 IST