డ్రాగన్‌పై మరోసారి ట్రంప్ ఆగ్రహం..!

ABN , First Publish Date - 2020-09-27T11:56:11+05:30 IST

తాను మళ్లీ అధికారంలోకి వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ చైనాపై అమెరికా ఆధారపడకుండా చేస్తానని అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. బీజింగ్‌ నుంచే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన విషయాన్ని ఎలా మరిచిపోతామంటూ అసంతృప్తి వెళ్లగక్కారు.

డ్రాగన్‌పై మరోసారి ట్రంప్ ఆగ్రహం..!

వాషింగ్టన్‌, సెప్టెంబరు 26: తాను మళ్లీ అధికారంలోకి వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ చైనాపై అమెరికా ఆధారపడకుండా చేస్తానని అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. బీజింగ్‌ నుంచే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన విషయాన్ని ఎలా మరిచిపోతామంటూ అసంతృప్తి వెళ్లగక్కారు. కరోనా వైరస్‌ అనంతర కాలంలో ఆ దేశంతో సంబంధాలు అంతగా ఉండకపోవచ్చని న్యూపోర్టు వర్జీనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యానించారు.


అమెరికా ఆర్థిక పరిస్థితి ఉచ్ఛస్థితిలో ఉండగా చైనా నుంచి వైరస్‌ విరుచుకుపడిందని గుర్తుచేశారు. తాను మరోసారి పగ్గాలు చేపడితే ఉత్పత్తిరంగంలో అమెరికాను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కాగా, కరోనా విషయంలో చైనాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ట్రంప్‌ యంత్రాంగం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే చైనా పాత్రికేయులు అమెరికాలో ఉండే కాలపరిమితిని 3 నెలలకు కుదించనుంది. విదేశీ జర్నలిస్టులకు 240 రోజులు ఉండేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. అంతే కాలానికి పొడిగింపు అవకాశం కూడా ఉంటుంది. కానీ చైనా విషయంలో మాత్రం ఆ కాలపరిమితిని మూడునెలలకు కుదించాలని, అంతే మొత్తం కాలానికి పొడిగింపు ఇవ్వాలని ట్రంప్‌ యంత్రాంగం యోచిస్తోంది. విద్యార్థులు, రిసెర్చర్లు, విదేశీ జర్నలిస్టులకు నిర్దిష్ట కాలపరిమితిని అమలు చేయాలన్న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) చేసిన ప్రతిపాదనలో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకోనుంది.

Updated Date - 2020-09-27T11:56:11+05:30 IST