చైనాపై దృష్టితో భారత్, అమెరికా మెగా వార్ గేమ్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-06-23T23:39:56+05:30 IST

చైనా దూకుడుకు కళ్లెం వేయగల సత్తా ఉందని చాటి చెప్పేందుకు

చైనాపై దృష్టితో భారత్, అమెరికా మెగా వార్ గేమ్ ప్రారంభం

న్యూఢిల్లీ : చైనా దూకుడుకు కళ్లెం వేయగల సత్తా ఉందని చాటి చెప్పేందుకు మల్టీ డొమైన్ వార్ గేమ్‌ను భారత్, అమెరికా ప్రారంభించాయి. రెండు రోజులపాటు జరిగే ఈ వార్ గేమ్ బుధవారం హిందూ మహా సముద్రంలో ప్రారంభమైంది. గగనతల రక్షణలో కలిసికట్టుగా కార్యకలాపాలను నిర్వహించే సత్తా మరింత బలోపేతం కావడానికి ఈ విన్యాసాలు దోహదపడతాయి. 


అణ్వాయుధ సామర్థ్యంగల విమాన వాహక నౌక యూఎస్ఎస్ రొనాల్డ్ రీగన్‌ నేతృత్వంలో నావల్ కేరియర్ స్ట్రైక్ గ్రూప్‌ను అమెరికా మోహరించింది. వీటితోపాటు ఎఫ్-18 యుద్ధ విమానాలు, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలయ్యే ఈ-2సీ హాక్ఐ విమానాలను కూడా మోహరించింది. 


భారత దేశం మోహరించినవాటిలో జాగ్వార్, సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు, ఐఎల్-78 ఎయిర్-టు-ఎయిర్ రీఫ్యూయలింగ్ ట్యాంకర్ విమానాలు, అవాక్స్ (ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్) విమానాలు ఉన్నాయి. వీటితోపాటు పీ8ఐ సముద్ర నిఘా విమానాలను, మిగ్29కే యుద్ధ విమానాలను భారత నావికా దళం మోహరించింది. 


విమాన వాహక నౌక, పెద్ద సంఖ్యలో డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్స్, ఇతర నౌకలతో కూడిన భారీ నావికా దళాన్ని కేరియర్ బ్యాటిల్ గ్రూప్ లేదా కేరియర్ స్ట్రైక్ గ్రూప్ అంటారు. యుద్ద నౌకలను, మర్చంట్ మెరైన్ నౌకలను కాపాడే యుద్ధ నౌకలను ఫ్రిగేట్స్ అంటారు. జలాంతర్గాములు, విమానాల నుంచి రక్షణ పొందడం కోసం ఉపయోగించే, వేగంగా ప్రయాణించే చిన్న యుద్ధ నౌకలను డిస్ట్రాయర్లు అంటారు. 


భారత నావికా దళం అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వల్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, భారత వాయు సేనకు చెందిన యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. అమెరికాకు చెందిన కేరియర్ స్ట్రైక్ గ్రూప్‌తో కలిసి సంయుక్తంగా విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. నిమిట్జ్ క్లాస్ విమాన వాహక నౌక రొనాల్డ్ రీగన్, ఆర్లీగ్ బుర్కే క్లాస్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యూఎస్ఎస్ హాల్సీ, టికొండెరొగ క్లాస్ గైడెడ్ మిసైల్ క్రూయిజర్ యూఎస్ఎస్ షిలోహ్ అమెరికా కేరియర్ స్ట్రైక్ గ్రూప్‌లో ఉన్నాయి. సముద్ర సంబంధిత కార్యకలాపాల్లో సమగ్రంగా సమన్వయంతో పని చేసే సత్తాను చాటుకోవడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను, సహకారాన్ని బలోపేతం చేసుకోవడమే ఈ విన్యాసాల లక్ష్యం. 


Updated Date - 2021-06-23T23:39:56+05:30 IST