ఇరాన్‌పై యూఎస్ ఆంక్షలు.. తప్పుబట్టిన ప్రపంచ దేశాలు

ABN , First Publish Date - 2020-09-21T11:53:47+05:30 IST

ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి గతంలో విధించిన ఆంక్షలను తాము తిరిగి విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. జాయింట్‌ కాంప్రిహెన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ (జేసీపీవోఏ)ను పాటించడంలో ఇరాన్‌ విఫలమైందని పేర్కొంది.

ఇరాన్‌పై యూఎస్ ఆంక్షలు.. తప్పుబట్టిన ప్రపంచ దేశాలు

వాషింగ్టన్‌/టెహ్రాన్‌, సెప్టెంబరు 20: ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి గతంలో విధించిన ఆంక్షలను తాము తిరిగి విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. జాయింట్‌ కాంప్రిహెన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ (జేసీపీవోఏ)ను పాటించడంలో ఇరాన్‌ విఫలమైందని పేర్కొంది. అయినా.. ఆ దేశానికి ఆయుధాల నిషేధాన్ని పొడిగించడంలో భద్రతా మండలి కూడా విఫలమైందని అమెరికా మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు.


తమకున్న హక్కుల ప్రకారం భద్రతా మండలి 2015లో విధించిన ఆంక్షలను తాము తిరిగి విధిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సోమవారం ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను జారీ చేస్తామన్నారు. అయితే అమెరికా నిర్ణయాన్ని భద్రతా మండలిలోని ఇతర సభ్యదేశాలు తప్పుబట్టాయి. అణు ఒప్పందం నుంచి 2018లోనే డొనాల్డ్‌ ట్రంప్‌ తప్పుకొన్నందున ఆంక్షలను పునరుద్ధరించే న్యాయపరమైన హక్కు అమెరికాకు లేదని పేర్కొన్నాయి. త్వరలో సర్వసభ్య సమావేశం జరగనున్న తరుణంలో ఈ నిర్ణయం సరైందికాదని అభిపాయ్రపడ్డాయి. మరోవైపు అమెరికా ప్రయత్నాలను ఇరాన్‌ తోసిపుచ్చింది. అమెరికా చర్యతో ప్రపంచ మార్కెట్‌లో ఇరాన్‌ కరెన్సీ విలువ ఒక్కసారిగా పడిపోయింది. డాలర్‌కు 2,72,500కు తగ్గిపోయింది. 


టిక్‌టాక్‌, ఒరాకిల్‌, వాల్‌మార్ట్‌ డీల్‌కు ట్రంప్‌ మద్దతు 

టిక్‌టాక్‌, రెండు అమెరికా దిగ్గజ కంపెనీలైన ఒరాకిల్‌, వాల్‌మార్ట్‌ మధ్య ప్రతిపాదిత ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూత్రప్రాయ మద్దతు ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం అమెరికాలో కొత్త కంపెనీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.


Updated Date - 2020-09-21T11:53:47+05:30 IST