కేసులు భారీగా పెరగడంతో.. అమెరికాలో మరోమారు ఆసుపత్రుల కొరత ఏర్పడే అవకాశం

ABN , First Publish Date - 2020-07-07T21:27:27+05:30 IST

అమెరికాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. నిత్యం 50 వేల కేసులు నమోదవుతుండటంతో

కేసులు భారీగా పెరగడంతో.. అమెరికాలో మరోమారు ఆసుపత్రుల కొరత ఏర్పడే అవకాశం

వాషింగ్టన్: అమెరికాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. నిత్యం 50 వేల కేసులు నమోదవుతుండటంతో రాష్ట్రాల గవర్నర్లకు కొత్త భయం పట్టుకుంది. ఇదే పరిస్థితి కొనసాగుతూ పోతే.. మరికొద్ది రోజుల్లో రాష్ట్రాల్లోని ఆసుపత్రులన్ని కరోనా పేషంట్లతో నిండిపోతాయేమోనని గవర్నర్లు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రుల కొరత ఏర్పడే పరిస్థితి వస్తే ఏం చేయాలో తెలియని స్థితిలో గవర్నర్లు ఉన్నారు. ఒకపక్క దీని గురించి ఆందోళన చెందుతున్నప్పటికి.. గవర్నర్లు మరోపక్క ఆంక్షలను ఎత్తివేస్తూ వెళ్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఎకానమీని పూర్తిగా తెరిచేందుకే మొగ్గు చూపడంతో.. గవర్నర్లు కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలలో అమెరికా పరిస్థితి ఏ విధంగా అయితే ఉందో.. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనపడుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే అప్పుడు కేవలం న్యూయార్క్ మాత్రమే కరోనాకు కేంద్రంగా ఉండేదని.. కాని ఇప్పుడు దేశవ్యాప్తంగా నాలుగు చోట్ల కరోనా కేంద్రాలు తయారయ్యాయని అన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో లాస్ ఏంజెల్స్, అరిజోనా , టెక్సాస్‌, ఫ్లోరిడాలోని కొన్ని నగరాలు కరోనాకు కేంద్రంగా మారిపోయాయి. 


కరోనాకు ఒకప్పుడు కేంద్రంగా ఉన్న న్యూయార్క్‌లో ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోపక్క మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం కేసులు విజృంభిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం.. ఫ్లోరిడా, న్యూయార్క్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించకపోతే రెండు వారాల్లో ఆసుపత్రులు పేషంట్లతో నిండిపోయవడం ఖాయమని ఆస్టిన్ నగర మేయర్ స్టీవ్ ఆడ్లర్ అన్నారు. పది రోజుల్లో ఐసీయూల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. లాక్‌డౌన్‌లో సడలింపులిచ్చిన వెంటనే ప్రజలు అసలు వైరస్ అనేది లేదనే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ మియామి నగర మేయర్ ఫ్రాన్సిస్ సూరెజ్ మండిపడ్డారు. కాగా.. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కల ప్రకారం.. అమెరికాలో ఇప్పటివరకు 29,38,625 కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 1,30,306 మంది మరణించారు.

Updated Date - 2020-07-07T21:27:27+05:30 IST