H-1B visa: భారతీయ నిపుణులకు తీపి కబురు

ABN , First Publish Date - 2021-08-21T22:41:20+05:30 IST

హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిపుణులకు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తీపి కబురు అందించారు.

H-1B visa: భారతీయ నిపుణులకు తీపి కబురు

న్యూఢిల్లీ: హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిపుణులకు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తీపి కబురు అందించారు. అమెరికా ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి భారతీయ నిపుణులకు హెచ్-1బీ వీసాలు జారీ చేసేందుకు అంగీకరించిందని శుక్రవారం ఆయన వెల్లడించారు. అలాగే ఇతర యూఎస్ వీసాల జారీని అగ్రరాజ్యం ఈ ఏడాది చివరి వరకు ప్రారంభించనుందని పేర్కొన్నారు. ఇక హెచ్-1బీ వీసా అనేది అమెరికన్ కంపెనీలకు వివిధ రంగాల్లో నైపుణ్యత గల విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు వీలు కల్పిస్తోంది. దీని ద్వారా భారతీయులే అధికంగా లబ్ధి పొందుతున్నారు. అగ్రరాజ్యం ప్రతియేటా 65వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. అలాగే మరో 20వేల వీసాలను అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు ఇస్తుంటుంది. 


కాగా, ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) స్టూడెంట్ వీసాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా శ్రింగ్లా పేర్కొన్నారు. అమెరికాతో పాటు పశ్చిమ ఐరోపా దేశాలు ప్రస్తుతం భారత విద్యార్థులకు వీసాలు జారీ చేస్తున్నాయని, ఎంఈఏ ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. అలాగే భారతీయ విద్యార్థులకు వీసాల జారీలో జాప్యం రాకుండా ఆస్ట్రేలియన్ మిషన్‌తో ఎంఈఏ సంప్రదింపులు జరుపుతోందని ఆయన తెలిపారు.   

Updated Date - 2021-08-21T22:41:20+05:30 IST