FBI raids in Trump Home: ఎఫ్‌బీఐ దాడుల్లో ట్రంప్ తప్పు చేసినట్టు రుజువయితే.. జరగబోయేది ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-09T16:41:12+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (FBI) సోమవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు సంబంధించిన ఫ్లోరిడాలోని పామ్‌బీచ్‌ (Palm Beach)లోని విలాసవంతమైన ఫామ్ హౌస్, రిసార్ట్ మార్-ఎ-లెగో (Mar-a-Lago)లో తనిఖీలు నిర్వహించింది.

FBI raids in Trump Home: ఎఫ్‌బీఐ దాడుల్లో ట్రంప్ తప్పు చేసినట్టు రుజువయితే.. జరగబోయేది ఏంటంటే..

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (FBI) సోమవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు సంబంధించిన ఫ్లోరిడాలోని పామ్‌బీచ్‌ (Palm Beach)లోని విలాసవంతమైన ఫామ్ హౌస్, రిసార్ట్ మార్-ఎ-లెగో (Mar-a-Lago)లో తనిఖీలు నిర్వహించింది. దర్యాప్తు ఏజెన్సీ ఏజెంట్లు ట్రంప్ ఇంటిని చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఇప్పటి వరకు ఎఫ్‌బీఐ దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సోషల్ మీడియా వేదికగా ట్రంపే ఈ సోదాల విషయాన్ని తెలియజేశారు. పామ్ బీచ్‌ (Palm Beach)లోని తన అందమైన నివాసం మార్-ఎ-లెగో (Mar-a-Lago) ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుందని మాజీ అధ్యక్షుడు వెల్లడించారు. కానీ, దీనికి గల కారణాలు మాత్రం ఆయన చెప్పలేదు. 


కాగా, రెండేళ్ల క్రితం అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ (Trump) పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్‌ (White House)ను ట్రంప్ తప్పనిసరి పరిస్థితుల్లో వీడాల్సి వచ్చింది. శ్వేతసౌధం నుంచి వెళ్లిపోయే సమయంలోనే దాదాపుగా 15 పెట్టెలను తీసుకెళ్లినట్టు ట్రంప్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ పెట్టెల్లోనే అమెరికాకు సంబంధించిన రహస్య పత్రాలను తీసుకెళ్లారనీ.. మరెన్నో ముఖ్యమైన పత్రాలను అక్రమంగా అధికారిక భవనం నుంచి ట్రంప్ ఎత్తుకెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై దర్యాప్తుకు సంబంధించిన చ‌ర్య‌ల్లో భాగంగా ఈ సోదాలు నిర్వ‌హిస్త‌ున్న‌ట్లు సమాచారం.


ట్రంప్ దోషిగా తేలితే తీవ్ర పరిణామం: న్యాయనిపుణులు

ఇక డొనాల్డ్ ట్రంప్ క్లాసిఫైడ్ వైట్‌హౌస్ పత్రాలను అక్రమంగా తీసుకెళ్లినట్టు రుజువు అయితే పబ్లిక్ ఆఫీస్ (Public Office) నుండి నిషేధించబడతారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. క్లాసిఫైడ్ పత్రాలను అక్రమంగా ఎత్తుకెళ్లారని తేలిన వ్యక్తి యునైటెడ్ స్టేట్స్‌లో ఏ పదవి చేపట్టకుండా అక్కడి ఫెడరల్ చట్టం (Federal Law) నిషేధిస్తుంది. ఇదే జరిగితే.. 2024లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలనే ట్రంప్ ఆశలకు గండిపడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నమాట. 'ఈ ఫెడరల్ చట్టం ప్రకారం ట్రంప్ దోషిగా తేలితే, అధ్యక్ష పదవి మాత్రమే కాకుండా.. చట్టసభల్లో ఏ పదవికి కూడా ఆయన అర్హుడు కాదు.. ఆయన్ను పూర్తిగా నిషేధిస్తారు..' అని మాజీ ఫెడరల్ ప్రాసిక్యూటర్ నియామా రహ్మానీ మీడియాతో అన్నారు. అమెరికా ప్రభుత్వ పత్రాలను దాచడం లేదా నాశనం చేయడం వంటి చర్యలకు సంబంధించి యూఎస్ కోడ్ టైటిల్ 18, సెక్షన్ 2071 కింద ట్రంప్‌పై అభియోగాలు మోపవచ్చని ఆయన వెల్లడించారు.


ఇక ఈ ఏడాది ప్రారంభంలో నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా తిరిగి పొందిన ఫ్లోరిడా ఎస్టేట్‌ (Florida Estate)కు సంబంధించిన క్లాసిఫైడ్ రికార్డులను ట్రంప్ తొలగించడంపై యూఎస్ న్యాయ శాఖ దర్యాప్తు చేస్తోంది. కొన్ని రికార్డులను నేషనల్ ఆర్కైవ్స్‌కు తిరిగి ఇవ్వడానికి అంగీకరించినట్లు గతంలో ధృవీకరించిన ట్రంప్.. దీనిని ఒక సాధారణ ప్రక్రియగా పేర్కొన్నారు. ఇప్పటికే ట్రంప్ అనేక చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. యూఎస్ క్యాపిటల్‌ భవనంపై దాడి, వైర్ ఫ్రాడ్, జార్జియా ఎన్నికల ట్యాంపరింగ్‌తో సహా అనేక కేసుల్లో ట్రంప్ ప్రస్తుతం విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు. అయితే, ఎఫ్‌బీఐ (FBI) దాడుల సమయంలో ట్రంప్‌ ఇంట్లో లేదని, ప్రస్తుతం ఆయన న్యూజెర్సీ (New Jersey)లో ఉన్నట్లు తెలుస్తోంది.


2024 ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం: ట్రంప్

ఇదిలాఉంటే.. తన నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తనదైన రీతిలో స్పందించారు. ఇది పక్కాగా రాజకీయ ప్రతీకారమేనని ఆరోపించారు. దేశ మాజీ అధ్యక్షుడి ఇంటిని దర్యాప్తు సంస్థ తనిఖీ చేయడం అగ్రరాజ్యానికి ఇది గడ్డు కాలంగా ఆయన అభివర్ణించారు. తాను ప్రభుత్వ సంస్థ అయిన ఎఫ్‌బీఐ (FBI)కు అన్నీ విధాలుగా స‌హ‌క‌రిస్తున్నా కానీ తన నివాసంలో ఆక‌స్మిక దాడులు చేయ‌డం సరికాదని ట్రంప్ వాపోయారు. దీనిని ప్రాసిక్యూటోరియల్ దుష్ప్రవర్తనగా పేర్కొన్నారు. 2024లో అధ్యక్ష పదవికి తాను పోటీ చేయకుండా చేసేందుకే ఇలాంటి పన్నాగాలకు పాల్ప‌డుతున్నారని, ఇది ముమ్మాటికి రాజకీయ ప్రతీకారమేనని ట్రంప్ మండిపడ్డారు. యూఎస్ ‌(US)లో ఇంతకుముందు ఏ మాజీ అధ్యక్షుడికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ‘2024 ఎన్నికల్లో పోటీ చేయకుండా తనను ఆపాలని కోరుకునే కరుడుగట్టిన డెమొక్రాట్ల దాడి ఇది’ అంటూ ట్రంప్‌ విమర్శలు గుప్పించారు.

Updated Date - 2022-08-09T16:41:12+05:30 IST