అమెరికా ప్రథమ మహిళ Jill biden పై విమర్శల వెల్లువ .. మమ్మల్ని చపాతీలతో పోలుస్తారా అంటూ..

ABN , First Publish Date - 2022-07-12T23:39:29+05:30 IST

ఈ వ్యాఖ్యలపై హిస్పానిక్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మా వారసత్వాన్ని, అందులోని సంక్లిష్టతలను జిల్ బైడెన్, ఆమెకు ప్రసంగాలు రాసిచ్చే వారూ సరిగా అర్థం చేసుకుంటే మంచిది. మేమేమీ టాకోస్ కాదు. విభిన్న వర్గాలు, సంస్కృతులు, జీవన విధానాలతో మా వారసత్వం రూపుదిద్దుకుంది. ఇలాంటి పోలికలతో మా సంస్కృతి విశిష్టతను తగ్గించొద్దు’’ అని కామెంట్ చేశారు. మరోవైపు జిల్ బైడెన్‌పై రాజకీయ ప్రత్యర్థులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ వల్లే లాటిన్ అమెరికా సంతతి ప్రజలు డెమోక్రటిక్ పార్టీకి దూరమవుతున్నారని రిపబ్లికన్ నేత, అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు ఆండీ బిగ్స్ ట్వీట్ చేశారు.

అమెరికా ప్రథమ మహిళ Jill biden పై విమర్శల వెల్లువ .. మమ్మల్ని చపాతీలతో పోలుస్తారా అంటూ..

ఎన్నారై డెస్క్: పత్రికా సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe biden) తడబాటుతో జరిగే పొరపాట్లు నిత్యం చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈసారి బైడెన్ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్(Jill biden) వంతు వచ్చింది. ఇటీవల టెక్సాస్ రాష్ట్రంలో జిల్ బైడెన్ చేసిన వ్యాఖ్యలతో లాటిన్ అమెరికా సంతతి వారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మమ్మల్ని టాకోలతో(గోధుమ పిండి లేదా మొక్కజొన్నలతో చేసే చపాతీల్లాంటి ఆహారం) పోలుస్తారా అంటూ మండిపడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకైతే అంతే లేకుండా పోయింది. అసలేం జరిగిందంటే..

టెక్సాస్(Texas) రాష్ట్రంలోని శాన్ ఆంటోనియో(San antonio) నగరంలో సోమవారం లాటిన్ అమెరికా సంతతి వారి హక్కుల సంస్థ యూనిడోస్‌యూఎస్ వార్షిక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరైన జిల్ బైడెన్.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు రౌల్‌ను అభినందించారు. ‘‘రౌల్ ఈ సంస్థ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. వివిధ సంస్కృతులు, సంప్రదాయాల కలయిక అయిన లాటిన్ అమెరికా వారసత్వాన్ని రౌల్ అర్థం చేసుకున్నారు. లాటిన్ అమెరికా వారసత్వం.. మియామీలోని బ్లాసమ్స్(పూలు) అంత అందమైనది, శాన్ ఆంటోనియోలోని టాకోస్(Tacos) అంత ప్రత్యేకమైనది. ఈ వారసత్వమే లాటిన్ అమెరికా ప్రజల బలం’’ అని చెప్పారు. దీంతో విషయం బెడిసికొట్టింది. అల్పాహారమైన టాకోస్‌తో లాటినో ప్రజలను పోల్చడం వారికి కోపం తెప్పించింది. 

ఈ వ్యాఖ్యలపై హిస్పానిక్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మా వారసత్వాన్ని, అందులోని సంక్లిష్టతలను జిల్ బైడెన్, ఆమెకు ప్రసంగాలు రాసిచ్చే వారూ సరిగా అర్థం చేసుకుంటే మంచిది. మేమేమీ టాకోస్ కాదు. విభిన్న వర్గాలు, సంస్కృతులు, జీవన విధానాలతో మా వారసత్వం రూపుదిద్దుకుంది. ఇలాంటి పోలికలతో మా సంస్కృతి విశిష్టతను తగ్గించొద్దు’’ అని కామెంట్ చేశారు. మరోవైపు జిల్ బైడెన్‌పై రాజకీయ ప్రత్యర్థులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇలాంటి కామెంట్స్ వల్లే లాటిన్ అమెరికా సంతతి ప్రజలు డెమోక్రటిక్ పార్టీకి దూరమవుతున్నారని రిపబ్లికన్ నేత, అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు ఆండీ బిగ్స్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2022-07-12T23:39:29+05:30 IST