వినోదం కోసం ఎక్కిన రైడ్ యంత్రం.. చేదు అనుభవం మిగిల్చింది!
ABN , First Publish Date - 2021-07-11T19:14:37+05:30 IST
వినోదం కోసం ఎక్కిన అమ్యూజ్మెంట్ రైడ్ యంత్రం కాస్తా చేదు అనుభవాన్ని మిగిల్చిన ఘటన అమెరికాలోని మిచిగాన్‌లో చోటు చేసుకుంది.
మిచిగాన్: వినోదం కోసం ఎక్కిన అమ్యూజ్మెంట్ రైడ్ యంత్రం కాస్తా చేదు అనుభవాన్ని మిగిల్చిన ఘటన అమెరికాలోని మిచిగాన్‌లో చోటు చేసుకుంది. అయితే, అక్కడే ఉన్న ఓ వ్యక్తి సమయ స్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. అసలేం జరిగిందంటే.. మిచిగాన్‌లో 'నేషనల్ చెర్రి ఫెస్టివల్' సందర్భంగా ఓ కార్నివాల్ జరుగుతోంది. అందులో ఏర్పాటు చేసిన ఓ అమ్యూజ్మెంట్ రైడ్.. దానిపై ఎక్కిన కొందరికీ చుక్కలు కనిపించాయి. ఈ మ్యాజిక్ కార్పెట్ రైడ్‌లో ఎక్కి.. పైకి వెళ్లేవరకు అంతా మాములుగానే ఉంది. కానీ గాలిలో ఉండగా ఆ యంత్రం దాదాపు ఊడిపోయింది. ఇంకేముంది అందులో గాలిలో ఊగుతున్న వారు భయాందోళనలతో గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అది విన్న యంత్రం చుట్టుపక్కల ఉన్నవారు భయంతో దూరంగానే నిలబడిపోయారు.
కానీ వారి మధ్యలో ఉన్న ఓ వ్యక్తి మాత్రం సమయ స్ఫూర్తి ప్రదర్శించాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్యూజ్మెంట్ రైడ్ యంత్రం కిందిభాగంపై గట్టిగా నిబడిపోయాడు. అతడ్ని చూసిన మరి కొంతమంది కూడా ఒక్కొక్కరుగా యంత్రం అడుగు భాగంపై నిలబడ్డారు. దాంతో ఆ యంత్రం పడిపోకుండా అలాగే నిలబడింది. అనంతం వెంటనే రైడ్‌ని ఆపేసి, అందులో ఉన్న వారిని కిందికి దించేశారు. అందరూ సురక్షితంగా కిందకు దిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడి వారు తమ మొబైల్స్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దాంతో ఇప్పుడీ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సమయ స్ఫూర్తితో ఆ యంత్రంపై నిలబడ్డ ఆ వ్యక్తిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.