ట్రంప్ వల్లే అమెరికాలో సంక్షోభం: కమలా హ్యారిస్

ABN , First Publish Date - 2020-10-18T15:53:56+05:30 IST

విస్కాన్సిన్ రాష్ట్ర వర్చువల్ ఫండ్ రైజర్ కార్యక్రమంలో మాట్లాడిన డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, భారతీయ అమెరికన్ సెనేటర్ కమలా హ్యారిస్... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

ట్రంప్ వల్లే అమెరికాలో సంక్షోభం: కమలా హ్యారిస్

మాకాన్(యూఎస్): విస్కాన్సిన్ రాష్ట్ర వర్చువల్ ఫండ్ రైజర్ కార్యక్రమంలో మాట్లాడిన డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, భారతీయ అమెరికన్ సెనేటర్ కమలా హ్యారిస్... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేలవమైన పరిపాలన విధానాల వల్ల ఇవాళ అగ్రరాజ్యం అమెరికా అన్ని రంగాల్లో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. ట్రంప్ విఫలమైన విధానాల వల్ల అమెరికా ప్రజారోగ్యం, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, ఆకలి, రేసికల్ జస్టిస్ వంటి పలు రంగాల్లో యూఎస్ పెద్ద సంక్షోభాలను ఎదుర్కొంటోందని మండిపడ్డారు. 


కరోనావైరస్ ప్రభావం అమెరికాలో ప్రారంభం అవ్వడానికి ముందే దాని తీవ్రత గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తెలుసునని, కానీ తేలికగా తీసుకోవడంతో అగ్రరాజ్యం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. "జనవరి 28న అధ్యక్షుడికి కరోనా విషయమై సమాచారం ఉంది. ఫ్లూ కంటే కూడా ఐదు రేట్లు ఈ వైరస్ ప్రమాదకరమని ఆయనకు తెలుసు. అయినా ట్రంప్ అలసత్వం ప్రదర్శించడం దారుణం" అని కమలా అన్నారు. దీని ఫలితంగా రెండు లక్షలకు పైగా అమెరికన్లు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎన్నడూ లేని విధంగా ఆర్థిక, నిరుద్యోగ సమస్యలు తలెత్తాయని, వైరస్‌ను కట్టడి చేయడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ విఫల అధ్యక్షుడికి మరోసారి బాధ్యతలు దక్కితే దేశ భవిష్యత్తు అంధకారమే అనడంలో ఎలాంటి సందేహం లేదని కమలా చెప్పుకొచ్చారు.     


Updated Date - 2020-10-18T15:53:56+05:30 IST