భారత్‌పై ప్రయాణ ఆంక్షలను తగ్గించిన అమెరికా

ABN , First Publish Date - 2021-08-17T18:47:22+05:30 IST

మహమ్మారి కరోనా నేపథ్యంలో భారత్‌‌పై విధించిన కరోనా ఆంక్షలను అమెరికా తగ్గించింది. భారత్‌ను లెవల్-4 నుంచి లెవల్-2లోకి చేర్చింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా పరిస్థితులు మెరుగుపడడంతో యూఎస్ ఈ నిర్ణయం తీసుకుంది.

భారత్‌పై ప్రయాణ ఆంక్షలను తగ్గించిన అమెరికా

వాషింగ్టన్: మహమ్మారి కరోనా నేపథ్యంలో భారత్‌‌పై విధించిన కరోనా ఆంక్షలను అమెరికా తగ్గించింది. భారత్‌ను లెవల్-4 నుంచి లెవల్-2లోకి చేర్చింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా పరిస్థితులు మెరుగుపడడంతో యూఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారత్‌పై లెవల్-4 ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశ పౌరులను ఇండియాకు రాకుండా నిషేధించింది. అయితే, తాజాగా భారత్‌లో కోవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) లెవల్-2 ట్రావెల్ హెల్త్ నోటీసులు జారీ చేసింది.


దీని ప్రకారం అమెరికన్లు ఇప్పుడు భారత్‌కు వెళ్లడం సురక్షితమనేది సీడీసీ అభిప్రాయం. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆమోదించిన కరోనా టీకాలను రెండు డోసులు తీసుకున్న అమెరికన్లు భారత్ వెళ్లినా.. వైరస్ బారిన పడే అవకాశం చాలా తక్కువని సీడీసీ అభిప్రాయపడింది. అయితే, అమెరికన్లు ఎట్టిపరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్‌కు మాత్రం వెళ్లొద్దని హెచ్చరించింది. అలాగే సాయుధ సంఘర్షణకు అవకాశం ఉన్నందున ఇండో-పాక్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించవద్దని సూచించింది. అంతేగాక విదేశాలకు వెళ్లే అమెరికన్లు తప్పనిసరిగా సీడీసీ సూచనలు పాటించాలని కోరింది. 

Updated Date - 2021-08-17T18:47:22+05:30 IST