మూడున్నర నెలల తర్వాత.. అమెరికాలో ఇదే తొలిసారి..

ABN , First Publish Date - 2021-03-09T22:07:06+05:30 IST

అమెరికాలో మూడున్నర నెలల తర్వాత తొలిసారి కరోనా మరణాలు తగ్గడం కాస్తా ఊరటనిచ్చే విషయం.

మూడున్నర నెలల తర్వాత.. అమెరికాలో ఇదే తొలిసారి..

వాషింగ్టన్: అమెరికాలో మూడున్నర నెలల తర్వాత తొలిసారి కరోనా మరణాలు తగ్గడం కాస్తా ఊరటనిచ్చే విషయం. మూడు నెలల తర్వాత సోమవారం 1000లోపు మరణాలు నమోదైనట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కేవలం 749 మంది మాత్రమే కొవిడ్-19తో మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు. గతేడాది నవంబర్ 29న ఒకేరోజు 822 మంది మహమ్మారికి బలి కాగా.. మూడున్నర నెలల తర్వాత సోమవారం వెయ్యిలోపు మరణాలు నమోదయ్యాయి. ఇక జనవరి 12న దేశవ్యాప్తంగా అత్యధికంగా 4,473 మరణాలు నమోదైనట్లు యూనివర్శిటీ పేర్కొంది. అధ్యక్షుడు జో బైడెన్.. కొవిడ్-19 కట్టడికి చేపట్టిన నివారణ చర్యలు పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గడంలో కీలక పాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం, మాస్క్ ధరించడం తప్పనిసరి చేయడం లాంటి చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. 


బైడెన్ బాధ్యతలు చేపట్టడానికి ముందు క్రిస్మస్, థ్యాంక్స్‌ గివింగ్ డే సందర్భంగా అగ్రరాజ్యంలో కొవిడ్ మరణాలు, కొత్త కేసులు గణనీయంగా పెరిగాయి. అనంతరం బైడెన్ పదవిలోకి వచ్చాక.. మహమ్మారి కట్టడికి పలు కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో కొంతమేర పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఇక తాజాగా మహమ్మారిపై పోరులో భాగంగా సెనేట్ 1.9ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి కూడా ఆమోదం తెలిపింది. దీని ద్వారా అమెరికన్లకు ఆర్థిక సాయం, పన్ను మినహాయింపులు, మహమ్మారిపై పోరుకు నిధులను వెచ్చించనున్నారు. ఇదిలాఉంటే.. అగ్రరాజ్యాన్ని వణించిన మహమ్మారి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల మందికి ప్రబలగా.. ఇందులో 5.30 లక్షలకు పైగా మందిని పొట్టనబెట్టుకుంది. 

Updated Date - 2021-03-09T22:07:06+05:30 IST