ఆ మెడిసిన్ నన్ను కాపాడింది.. కరోనా నుంచి కోలుకున్న అమెరికన్ సంచలన వ్యాఖ్యలు...

ABN , First Publish Date - 2020-04-07T21:51:46+05:30 IST

ప్రపంచదేశాలు మొత్తం ఇప్పుడు హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ గురించే చర్చించుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత

ఆ మెడిసిన్ నన్ను కాపాడింది.. కరోనా నుంచి కోలుకున్న అమెరికన్ సంచలన వ్యాఖ్యలు...

బ్రూక్లిన్: ప్రపంచదేశాలు మొత్తం ఇప్పుడు హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ గురించే చర్చించుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత ప్రభుత్వాన్ని హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ అడగడం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకోవడం ద్వారా కరోనా తగ్గుతుందని ఇప్పటివరకు అధికారికంగా ఏ ఒక్క ప్రభుత్వం వెల్లడించలేదు. ఇదిలా ఉండగా.. కరోనా నుంచి కోలుకున్న ఓ అమెరికన్ పౌరుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడటం వల్లే తాను కరోనా బారి నుంచి బయట పడినట్టు బ్రూక్లిన్‌కు చెందిన జేమ్స్ కానిజారో(58) చెబుతున్నాడు. దాదాపు నెల రోజుల నుంచి చికిత్స పొందుతూ వచ్చిన జేమ్స్.. ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. తన డాక్టర్లు, హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్లే తాను కరోనాను జయించానని జేమ్స్ చెబుతున్నాడు. మంచి డాక్టర్లు ఉంటే కరోనా నుంచి సులభంగా బయటపడవచ్చని, ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేమ్స్ భరోసానిచ్చాడు. జేమ్స్ వ్యాఖ్యలతో హైడ్రాక్సీక్లోరోక్విన్ నిజంగా కరోనా నుంచి విముక్తి కలిగిస్తుందా అన్న చర్చ ప్రారంభమైంది.


జేమ్స్ విషయానికి వస్తే.. మార్చి ఏడో తేదీన తన భార్యతో కలిసి సినిమాకు వెళ్లానని.. అదే రోజు రాత్రి ఒక్కసారిగా దగ్గ, ఒళ్లు నొప్పులు మొదలైనట్టు జేమ్స్ పేర్కొన్నాడు. వెంటనే పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలినట్టు తెలిపాడు. 17 రోజుల పాటు తనను ఐసీయూలోనే ఉంచారని, తాను మరణిస్తానేమోనన్న భయం కూడా వేసిందన్నాడు. అయితే ఒకరోజు డాక్టర్లు తనకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇచ్చారని.. కొద్ది గంటల తర్వాత ఆరోగ్యం కొంచెం కుదుటపడినట్టు అనిపించిందన్నాడు. ఇలా మూడు రోజుల పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకోవడంతో.. తాను సాధారణ స్థితికి వచ్చేశానని జేమ్స్ తెలిపాడు. కాగా.. జేమ్స్‌కు డాక్టర్లు వరుసగా పదిరోజుల పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇచ్చారు. సరిగ్గా పదకొండో రోజు జేమ్స్ పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇదిలా ఉండగా.. జేమ్స్‌ అంతకుముందు ఆస్తమాతో బాధపడుతున్నట్టు చెప్పాడు. కరోనా మహమ్మారి ఎక్కువగా ఊపిరితిత్తులపైనే తన ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగా న్యుమోనియా, ఆస్తమా ఇలా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు కరోనా నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2020-04-07T21:51:46+05:30 IST