ప్రపంచ యుద్దంలో మరణించిన వారి కంటే.. అమెరికాలో..

ABN , First Publish Date - 2021-01-21T22:31:40+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ

ప్రపంచ యుద్దంలో మరణించిన వారి కంటే.. అమెరికాలో..

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం.. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 4 లక్షల మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు. బుధవారం నమోదైన మరణాలతో రెండో ప్రపంచ యుద్దంలో మరణించిన అమెరికన్ల సంఖ్య కంటే కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. రెండో ప్రపంచ యుద్దంలో 4,05,399 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య బుధవారం నాటికి 4,05,400 దాటేసింది. 


మరోపక్క అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రానున్న వంద రోజుల్లో పది కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడమే లక్ష్యంగా జో బైడెన్ ముందుకు వెళ్తున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ కూడా పది కోట్ల వ్యాక్సిన్ డోస్‌ల లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించేందుకు సహాయం అందించడానికి సిద్దంగా ఉన్నట్టు తెలిపింది. తమ సంస్థకు చెందిన లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా.. అమెరికాలో మరింత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు తప్పకుండా మాస్క్ ధరించాలంటూ జో బైడెన్ ప్రజలకు సూచించారు.

Updated Date - 2021-01-21T22:31:40+05:30 IST