వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో హెచ్-1బీ వీసాల జారీ కోసం ప్రతిపాదించిన కొత్త విధానాన్ని అమెరికా న్యాయస్థానం తోసిపుచ్చింది. వేతన పరిమితి బట్టి వీసాలు జారీ చేయాలనే ప్రతిపాదనను కోర్టు కొట్టివేసింది. దీంతో పాత పద్దతి అయిన లాటరీ విధానంలో హెచ్-1బీ వీసాల జారీ ఉండనుంది. ఇది అధిక సంఖ్యలో హెచ్-1బీ వీసాలు పొందే భారతీయులకు నిజంగా గుడ్న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ వీసాల ఎంపికలో లాటరీ విధానం సరికాదని, వేతన పరిమితిని బట్టి వీటిని జారీ చేయాలంటూ అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం(యూఎస్సీఐఎస్) ట్రంప్ హయాంలో ప్రతిపాదించింది.
అయితే, కొత్త నిబంధనల ప్రకారం గ్రాడ్యుయేట్ విద్యార్థులు అర్హత సాధించలేరని వారిని నియమించుకోవడం కష్టతరం అవుతుందని వ్యాపార వర్గాలు ఫిర్యాదు చేశాయి. అటు ఈ నిర్ణయాన్ని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా వ్యతిరేకించింది. దీన్ని కొట్టేయాలంటూ 2020లో కాలిఫోర్నియా నార్తెర్న్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించింది. తాజాగా విచారణ చేపట్టిన న్యాయమూర్తి జాఫ్రీ వైట్ బుధవారం తీర్పునిచ్చారు. ‘‘ప్రతిపాదిత ఉత్తర్వులు జారీచేసిన నాటి తాత్కాలిక హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీ చాద్ ఓల్ఫ్ చట్టబద్ధంగా వ్యవహరించలేదు. ఆ కారణం వల్ల ఆయన ప్రతిపాదించిన హెచ్1-బీ వీసా కోటా ఎంపిక ప్రతిపాదనను కొట్టివేస్తున్నాం’’ అని జడ్జి జాఫ్రీ వైట్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కమలా హ్యారిస్ హత్యకు కుట్ర.. చివరి నిమిషంలో..
PM Modi స్ఫూర్తితో చాయ్వాలాగా మారిన NRI.. ఈయన జీవితమే ఓ ఛాలెంజ్
ఇక ప్రతియేటా అమెరికా స్వదేశీ సంస్థల్లో విదేశీ నిపుణుల నియామకాల కోసం 65వేల హెచ్-1బీ వీసాలు ఇస్తోంది. అలాగే అదనపు అర్హతగల నిపుణులకు మరో 20వేల వీసాలు జారీ చేస్తోంది. వీటిలో అధిక భాగం వీసాలు పొందేది భారత్, చైనా పౌరులే. దీనికోసం యూఎస్ ప్రభుత్వం మొదటి నుంచి లాటరీ విధానాన్నే అనుసరిస్తోంది. కానీ, ట్రంప్ ప్రభుత్వం 2020 అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ లాటరీ విధానాన్ని స్వస్తి పలుకుతామని, వేతన స్థాయిని బట్టి విదేశీ నిపుణులకు వీసాల జారీ ప్రక్రియను తీసుకువస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి అప్పుడు తాత్కాలిక హోంలాండ్ సెక్రటరీ చాద్ ఓల్ఫ్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
వీటిని 2021, మార్చి 9 నుంచి అమలు చేయాలని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం(యూఎస్సీఐఎస్) నిర్ణయించింది. అయితే, ఈ గడువును డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ ఏడాది డిసెంబరు 31కి వాయిదా వేసింది. ఇక ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్.. దాన్ని కొట్టేయాలంటూ 2020లో కాలిఫోర్నియా నార్తెర్న్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించింది. తాజాగా విచారణ చేపట్టిన న్యాయమూర్తి జాఫ్రీ వైట్.. ఓల్ఫ్ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, ఆయన ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని బుధవారం తీర్పును వెల్లడించారు. ఈ నిర్ణయంతో అమెరికాలో కొలువు కోసం ఎదురుచూస్తున్న భారత నిపుణులకు లబ్ధి చేకూరనుంది.