లాభాల కోసం.. కాస్మోటిక్స్ సంస్థ ‘అంతరిక్ష’ ఐడియా!

ABN , First Publish Date - 2020-09-28T18:54:33+05:30 IST

కరోనా వైరస్.. ప్రజల ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో సౌందర్య సాధనాలను కొనుగోలు చే

లాభాల కోసం.. కాస్మోటిక్స్ సంస్థ ‘అంతరిక్ష’ ఐడియా!

వాషింగ్టన్: కరోనా వైరస్.. ప్రజల ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో సౌందర్య సాధనాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపించడం లేదు. అయితే సౌందర్య సాధనాలను ఉత్పత్తి చేస్తున్న సంస్థలు మాత్రం.. ప్రజలను ఆకర్షించడానికి వినూత్న ఆలోచనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ.. ఎస్టీ లాడర్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉత్పత్తులను.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించాలని డిసైడ్ అయింది. 10 స్కిన్ సీరమ్ బాటిళ్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేందుకుగాను.. నాసాకు  1,28,000 డాలర్ల (రూ.94లక్షల)ను కూడా చెల్లించింది. అయితే తమ ఉత్పత్తులను అంతరిక్షంలోకి పంపడం ద్వారా.. ఆ సంస్థ గిరాకీని ఎలా పెంచుకుంటుందని ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఉంది అసలు సంగతి. అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు.. ఎస్టీ లాడర్ సంస్థ పంపిన సీరమ్ బాటిళ్లను అందంగా ఫొటోలు తీసి, వాటిని సంస్థకు చేరవేస్తారు. వ్యోమగాములు పంపిన ఫొటోలను.. ఆ సంస్థ వాణిజ్య ప్రకనల్లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తద్వారా తమ ఉత్పత్తులు బాగా అమ్ముడిపోయి, లాభాలు వస్తాయని సంస్థ భావిస్తుంది. ఇదిలా ఉంటే.. 10 సీరమ్ బాటిళ్లను అంతరిక్ష కేంద్రానికి పంపడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. మంగళవారం రోజు నాసా.. వాటిని రాకెట్‌లో అంతరిక్ష కేంద్రానికి పంపనున్నట్లు సమాచారం. 


Updated Date - 2020-09-28T18:54:33+05:30 IST