అగ్రరాజ్యం అమెరికా వెళ్లేవారికి తీపికబురు.. కాన్సులేట్ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-04-28T16:42:41+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా వెళ్లేవారికి గుడ్‌న్యూస్. కరోనా కారణంగా 2020 మార్చి నుంచి నిలిపివేసిన పర్యాటక వీసా(బీ1, బీ2)లకు సంబంధించిన ఇంటర్వ్యూలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు యూఎస్ కాన్సులేట్ ప్రకటించింది.

అగ్రరాజ్యం అమెరికా వెళ్లేవారికి తీపికబురు.. కాన్సులేట్ కీలక ప్రకటన

హైదరాబాద్‌: అగ్రరాజ్యం అమెరికా వెళ్లేవారికి గుడ్‌న్యూస్. కరోనా కారణంగా 2020 మార్చి నుంచి నిలిపివేసిన పర్యాటక వీసా(బీ1, బీ2)లకు సంబంధించిన ఇంటర్వ్యూలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు యూఎస్ కాన్సులేట్ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి వీసా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ ట్వీట్ చేసింది. పర్యాటక వీసా(బీ1, బీ2) కోసం తొలిసారి దరఖాస్తు చేసుకునేవారికి సెప్టెంబర్ నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొంది. దీనికి సంబంధించిన అపాయింట్‌మెంట్ల కోసం త్వరలోనే బుకింగ్స్ ప్రారంభిస్తామని తెలిపింది. రోలింగ్ బేసిస్ ఆధారంగా సాధ్యమైనంత ఎక్కువ అపాయింట్‌మెంట్స్ అందుబాటులో ఉంచనున్నట్లు తెలియజేసింది. ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ స్లాట్లను దశలవారీగా పెంచేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయంది. ఈ ఏడాది సుమారు 8లక్షల వీసా దరాఖాస్తుల ప్రాసెసే లక్ష్యంగా యూఎస్ మిషన్ ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా కాన్సులేట్ పేర్కొంది. 


ఇదిలాఉంటే.. ఇప్పటివరకు టూరిస్ట్ వీసాలు పరిమిత సంఖ్యలోనే జారీ అవుతున్నాయి. మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వీసాల జారీని భారత్‌లోని యూఎస్ ఎంబసీలతో పాటు అన్ని కాన్సులేట్‌ కార్యాలయాలు పరిమితం చేశాయి. ఇక గడువు ముగిసిన వీసాల రెన్యూవల్‌కు డ్రాప్‌ బాక్స్‌ విధానంలో అనుమతిస్తున్నారు. వచ్చేనెల నుంచి విద్యార్థి(ఎఫ్‌1) వీసా ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. జూన్‌ నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. గతేడాది మిషన్‌ ఇండియా ద్వారా 62 వేల మంది విద్యార్థులకు అమెరికా వీసాలు జారీ చేసింది. 



Updated Date - 2022-04-28T16:42:41+05:30 IST