భార‌త్ నుంచి త‌మ పౌరుల‌ను త‌ర‌లించ‌డం ప్రారంభించిన అమెరికా...

ABN , First Publish Date - 2020-04-02T18:37:56+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ఆగ‌మాగం చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారి విజృంభణ‌తో అమెరిక‌న్ల‌కు కంటి మీద కునుకులేకుండా పోయింది.

భార‌త్ నుంచి త‌మ పౌరుల‌ను త‌ర‌లించ‌డం ప్రారంభించిన అమెరికా...

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ఆగ‌మాగం చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారి విజృంభణ‌తో అమెరిక‌న్ల‌కు కంటి మీద కునుకులేకుండా పోయింది. క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని విల‌విలలాడుతున్న అగ్ర‌రాజ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు 2,15,417 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 5,110 మంది దీని బారిన పడి మరణించారు. రోజురోజుకీ త‌న ప్రాబ‌ల్యాన్ని పెంచుకుంటూ వెళ్తున్న కొవిడ్‌-19 క‌ట్ట‌డికి యూఎస్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. మొదట్లో కరోనాను తేలిగ్గా తీసి పారేసిన ట్రంప్ సర్కారు.. ఆ తర్వాత తీవ్రతను గుర్తించి నష్ట నివారణ చర్యలను చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా 60 దేశాల్లో ఉన్న 30,000 మంది అమెరికన్లను స్వ‌దేశానికి ర‌ప్పిస్తోంది. దీనికోసం 350కి పైగా విమానాలు రెడీ చేసిన‌ట్లు స‌మాచారం.


ఇండియా నుంచే యూఎస్‌ ఈ కార్య‌క్ర‌మాన్ని మొద‌లెట్టింది. బుధ‌వారం భార‌త్ నుంచి ఒక విమానంలో 170 మంది అమెరిక‌న్ పౌరుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించిన‌ట్లు కాన్సులర్ వ్యవహారాల ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఇయాన్ బ్రౌన్లీ విలేకరులతో అన్నారు. రాబోయే రోజుల్లో మ‌రింత మంది అమెరిక‌న్ల‌ను భార‌త్ నుంచి త‌ర‌లించేందుకు న్యూఢిల్లీ, ముంబ‌యి కేంద్రాలుగా 80 విమానాలు షెడ్యూల్ చేసిన‌ట్లు బ్రౌన్లీ పేర్కొన్నారు. ఇక్క‌డ ఉన్న యూఎస్ పౌరులు ఎవ‌రైతే స్వ‌దేశానికి రావాల‌ని అనుకుంటున్నారో వారంద‌రినీ త‌ప్ప‌కుండా తీసుకెళ్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఈ త‌ర‌లింపుకు భార‌త ప్ర‌భుత్వం త‌మ‌కు అన్ని విధాల స‌హ‌క‌రిస్తుంద‌ని, విమానాల ఏర్పాటుకు కూడా మోదీ స‌ర్కార్ చాలా హెల్ప్ చేసింద‌ని బ్రౌన్లీ తెలియ‌జేశారు. కాగా, సుమారు రెండు కోట్ల‌ మంది అమెరిక‌న్స్ ఓవ‌ర్సీస్‌లో ఉంటున్నార‌ని ఆయ‌న చెప్పారు. 


Updated Date - 2020-04-02T18:37:56+05:30 IST