కరోనా టీకాల విషయంలో.. అగ్రరాజ్యం కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-05-06T14:05:21+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం మాటల్లో చెప్పడం కష్టం. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తిని నిరోధించడం చాలా దేశాలకు కత్తిమీద సాముగా మారుతోంది.

కరోనా టీకాల విషయంలో.. అగ్రరాజ్యం కీలక నిర్ణయం!

వ్యాక్సిన్ల పేటెంట్స్ రద్దుకు అమెరికా మద్దతు

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం మాటల్లో చెప్పడం కష్టం. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తిని నిరోధించడం చాలా దేశాలకు కత్తిమీద సాముగా మారుతోంది. ఇక ఈ మహమ్మారి ముగింపుకు వైద్య నిపుణులు సూచిస్తున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. వైరస్‌ను తుదముట్టించాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరగాలనేది నిపుణుల మాట. దీంతో చాలా దేశాలు టీకా తయారీపై దృష్టిసారించాయి. కొన్ని దేశాలు ఈ విషయంలో విజయవంతమయ్యాయి కూడా. దాంతో ఆయా దేశాల్లో టీకా పంపిణీ జరుగుతోంది. కానీ, ఇప్పటికీ కొన్ని దేశాలు అసలు వ్యాక్సిన్లు అందుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. అలాంటి దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) 'కొవ్యాక్స్' కార్యక్రమం ద్వారా టీకాలు అందించే ప్రయత్నం చేస్తోంది. కానీ, చాలా దేశాల్లో ఇప్పటికీ వ్యాక్సిన్ల కొరత కొనసాగుతోంది.


ఈ సందర్భంగా అమెరికా వ్యాపార ప్రతినిధి కేథరిన్ టాయ్​ మాట్లాడుతూ.. "మేథో సంపత్తి హక్కుల పరిరక్షణకు అమెరికా సర్కార్ కట్టుబడి ఉంది. కొవిడ్ అంతం కోసం వ్యాక్సిన్ల మేధో సంపత్తి(ఐపీ) హక్కులను రద్దుచేసేందుకు అగ్రరాజ్యం మద్దతు తెలుపుతోంది." అని అన్నారు. అయితే ఈ అంశంలో ప్రపంచవాణిజ్య సంస్థ సూత్రాలకు అనుగుణంగా.. అంతర్జాతీయ ఒప్పందాలు కుదిరేందుకు సమయం పడుతుందని కేథరిన్ టాయ్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు, టీకాల ఉత్పతిని పెంచే విషయంలో తాము ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ), ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇక్కడ నైతిక, ఆర్థిక సమస్య వచ్చే అవకాశం ఉన్నట్లు డబ్ల్యూటీఓ చీఫ్ న్గోజీ ఒకోంజో ఇవేలా అభిప్రాయపడ్డారు.  


ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా వేధిస్తున్న టీకాల కొరత తీర్చే విషయమై అగ్రరాజ్యం అమెరికా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ల పేటెంట్స్ రద్దుకు జో బైడెన్ సర్కార్ ఆమెదం తెలిపింది. టీకాల మేధో సంపత్తి(ఐపీ) హక్కులను తొలగించాలని పేర్కొంది. ఒకవేళ ఇదే జరిగితే ఒక దేశం టీకాల ఫార్ములాను ఇతర దేశాలతో పంచుకునే వీలు ఏర్పడుతుంది. దాంతో ప్రపంచదేశాలు అన్ని రకాల టీకాలు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరగడంతో కొరత ఉండదు. మహమ్మారితో పోరులో భాగంగా ప్రపంచ పెద్దన్న తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని వైద్య నిపుణులు కీలక ముందడుగుగా పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ విషయమై భారత్, దక్షిణాఫ్రికా తమ గోడును వెళ్లబోసిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-05-06T14:05:21+05:30 IST