US: భారత్‌లో పర్యటించేవారు అప్రమత్తంగా ఉండండి.. అమెరికన్లను హెచ్చరించిన బైడెన్ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-10-08T03:05:14+05:30 IST

భారత్‌లో పర్యటించే అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలంటూ బైడెన్ ప్రభుత్వం తాజాగా సూచించింది.

US: భారత్‌లో పర్యటించేవారు అప్రమత్తంగా ఉండండి.. అమెరికన్లను హెచ్చరించిన బైడెన్ ప్రభుత్వం

వాషింగ్టన్: భారత్‌లో పర్యటించే అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలంటూ బైడెన్ ప్రభుత్వం తాజాగా సూచించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో పర్యటించవద్దని కూడా సూచించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగా శాఖ(State department) శుక్రవారం ఓ ప్రకటన(Advisory) జారీ చేసింది. భారత్‌లో నేరాలు, ఉగ్రవాదం దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అమెరికన్లను హెచ్చరించింది. దేశంలో అత్యాచార ఘటనలు పెరుగుతున్న వైనాన్ని భారత్ ప్రభుత్వం పేర్కొన్నట్టు కూడా అమెరికా విదేశాంగ శాఖ తన ప్రకటనలో ప్రస్తావించింది. లైంగిక దాడుల వంటి హింసాత్మక నేరాలు పర్యాటక స్థలాల్లో జరిగిన విషయాన్నీ పేర్కొంది. ప్రముఖ పర్యాటక స్థలాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలపై ఉగ్రవాదులు అకస్మిక దాడులకు దిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 


తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణా, పశ్చిమ బెంగాల్లోని గ్రామీణ ప్రదేశాల్లోని అమెరికా పౌరులకు అమెరికా ప్రభుత్వం నుంచి తక్షణసాయం అందడం కష్టమని, ఆయా ప్రాంతాలకు అమెరికా అధికారులు చేరుకోవాలంటే ముందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుందని కూడా వెల్లడించింది. కాగా.. పాకిస్థాన్‌  వెళ్లాలనుకుంటున్న అమెరికన్లకూ అక్కడి ప్రభుత్వం పలు సూచనలు చేసింది. పాకిస్థాన్‌లో అమెరికా పౌరులు ఎదుర్కొంటున్న ముప్పు ఆధారంగా దాయాది దేశాన్ని అమెరికా ‘లెవల్ 4’ కేటగిరీగా వర్గీకరించింది. ఉగ్రవాదం, వర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా అల్లకల్లోలంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచించింది. 

Updated Date - 2022-10-08T03:05:14+05:30 IST