US appeals court: కృత్రిమ మేధాశక్తి వ్యవస్థ పేటెంట్ ఇన్వెంటర్ కాజాలదు

ABN , First Publish Date - 2022-08-06T18:54:12+05:30 IST

అమెరికా పేటెంట్ చట్టం ప్రకారం కృత్రిమ మేధాశక్తి వ్యవస్థ

US appeals court: కృత్రిమ మేధాశక్తి వ్యవస్థ పేటెంట్ ఇన్వెంటర్ కాజాలదు

వాషింగ్టన్ : అమెరికా పేటెంట్ చట్టం ప్రకారం కృత్రిమ మేధాశక్తి వ్యవస్థ (artificial intelligence system) నూతన పరికల్పనల ఆవిష్కర్త (Inventor) కాజాలదని ఆ దేశ అపీల్స్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఈ చట్టం ప్రకారం ఇన్వెంటర్ అవాలంటే సహజ వ్యక్తి అయి ఉండటం తప్పనిసరి అని వివరించింది. కంప్యూటర్ సైంటిస్ట్ స్టీఫెన్ థలేర్ (Stephen Thaler) దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. 


కంప్యూటర్ సైంటిస్ట్ స్టీఫెన్ థలేర్ దాఖలు చేసిన పిటిషన్‌లో, తన DABUS system రెండు కొత్త ఆవిష్కరణలను చేసిందని తెలిపారు. వీటికి పేటెంట్లు ఇవ్వాలని కోరారు. DABUS సహజమైనదని, విషయాలను గ్రహించి, అనుభూతి చెందగలదని చెప్పారు. (DABUS = Device for the Autonomous Bootstrapping of Unified Sentience). 


పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన రియాన్ అబ్బోట్ మాట్లాడుతూ, కోర్టు తీర్పుపై అపీలు చేస్తామన్నారు. పేటెంట్ చట్టం ఉద్దేశాన్ని ఈ తీర్పు పట్టించుకోలేదన్నారు. దీని ప్రభావం వ్యతిరేకంగా ఉంటుందని చెప్పారు. 


DABUSకు పేటెంట్ల కోసం థలేర్ ప్రపంచ స్థాయిలో కృషి చేస్తున్నారు. ఓ ఆవిష్కర్తగా DABUSకు గుర్తింపు తెచ్చేందుకు యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియాలలో థలేర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. DABUS పేటెంట్స్ కోసం చేసిన దరఖాస్తులను వర్జీనియా కోర్టు తోసిపుచ్చింది. సిస్టమ్ మానవుడు కాదని తెలిపింది. దీనిని థలేర్ ఫెడరల్ సర్క్యూట్‌ కోర్టులో సవాల్ చేశారు. పేటెంట్ అపీళ్లను ఫెడరల్ సర్క్యూట్ కోర్టు విచారణ జరుపుతుంది. 


అది ఈ చట్టంలో లేదు

ఫెడరల్ సర్క్యూట్‌లో థలేర్ తరపు న్యాయవాది అబ్బోట్ జూన్‌లో మౌఖికంగా వాదనలు వినిపించారు. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు పేటెంట్ చట్టం ఉద్దేశానికి, దానిలో వాడిన భాషకు విరుద్ధంగా ఉందని చెప్పారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ చట్టం ఉద్దేశమని చెప్పారు. ఇన్వెంటర్ తప్పనిసరిగా సహజ వ్యక్తి అయి ఉండాలని ఈ చట్టం చెప్పడం లేదన్నారు. 


సందిగ్ధత లేదు 

దీనిపై ఫెడరల్ సర్క్యూట్ ముగ్గురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పింది. పేటెంట్ చట్టంలో సందిగ్ధత లేదని తెలిపింది. ఆవిష్కర్తలు (Inventors)  తప్పనిసరిగా సహజ మానవులు అయి ఉండాలని ఈ చట్టం చెప్తోందని పేర్కొంది. ఇది ఏకగ్రీవ తీర్పు.


ఇండివిడ్యువల్ అంటే...

ఈ చట్టం ప్రకారం ఇన్వెంటర్స్ ‘‘ఇండివిడ్యువల్స్’’ అయి ఉండాలని తెలిపింది. ఇండివిడ్యువల్ అంటే హ్యూమన్ బీయింగ్ అని వివరించింది. ప్రపంచంలో ఈ పదాలను సాధారణంగా ఉపయోగించే విధానాన్ని ప్రస్తావించింది. పేటెంట్ చట్టంలో వీటిని ఉపయోగించిన తీరును వివరించింది. మానవేతర ఆవిష్కర్తలను అనుమతించే ఉద్దేశం కాంగ్రెస్ (చట్టసభ)కు ఉండి ఉంటే, హిమ్‌సెల్ఫ్, హెర్‌సెల్ఫ్‌లతోపాటు ఇట్‌సెల్ఫ్ అని కూడా ఈ చట్టంలో ఉపయోగించి ఉండేదని తెలిపింది. 


అది ఊహాజనితం

కృత్రిమ మేధాశక్తి వ్యవస్థలకు పేటెంట్లను ఇస్తే నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తుందనే వాదన ఊహాజనితమని తెలిపింది. DABUSకు పేటెంట్‌ను నిరాకరించడమంటే, సైన్స్, ప్రయోజనకరమైన కళల ప్రగతిని ప్రోత్సహించాలని చెప్తున్న అమెరికా రాజ్యాంగ ఉద్దేశాన్ని నిరాకరించడమేనని థలేర్ చేసిన వాదనను తోసిపుచ్చింది. 


Updated Date - 2022-08-06T18:54:12+05:30 IST