తుపాకులు కూడా అత్యవసర వస్తువులే.. అమెరికా ప్రభుత్వ ప్రకటన

ABN , First Publish Date - 2020-03-29T18:52:00+05:30 IST

అమెరికా ప్రభుత్వం ఇటీవల గన్నులు కూడా అత్యవసర జాబితాలోకి వస్తాయంటూ ప్రకటించింది. గన్నుల తయారీకి సంబంధించిన అన్ని వ్యవస్థలూ ఈ వర్గీకరణ కిందకు వస్తాయని తెలిపింది.

తుపాకులు కూడా అత్యవసర వస్తువులే.. అమెరికా ప్రభుత్వ ప్రకటన

వాషింగ్టన్: కరోనా కలకలం నేపథ్యంలో అనేక దేశాల్లో అహారం, మందులు వంటి వస్తువులు అత్యవసర వస్తువులగా ప్రకటించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో వీటి సరఫరాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతోంది. దేశ భధ్రతకు కీలకమైన కొన్ని మౌలిక సదుపాయాలు కూడా అత్యవసర జాబితాలోకి వచ్చి చేరాయి. అయితే అమెరికాలో తాజాగా తుపాకులు కూడా అత్యవసర జాబితాలోకి వచ్చి చేరాయి. తుపాకుల తయారీకి సంబంధించిన అన్ని వ్యవస్థలూ ఈ వర్గీకరణ కిందకు వస్తాయని అమెరికా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫెడరల్ సైబర్ సెక్కురిటీ ఏజెన్సీ ఈ మేరకు రాష్ట్రాలకు ఓ సూచన జారీ చేసింది. స్థానికంగా అమల్లో ఉన్న నిబంధనలకు ఈ సూచన లోబడి ఉంటుందని, ఆయా నిబంధనలను అతిక్రమించదని తెలిపింది.ఈ ప్రకటన పట్ల గన్ను హక్కుల లాబీ బృందాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.  


తుపాకులను అత్యవసర వస్తువుల జాబితాలోకి చేర్చాలో వద్దో మీరే నిర్ణయించుకోండని కాలిఫోర్నియా గవర్నర్ గత వారం రాష్ట్రంలోని కౌంటీలకు సూచించారు. దీంతో కొన్ని కౌంటీల్లో తుపాకుల షాపులు మూత పడ్డాయి. కానీ ఈ నిర్ణయాన్ని గన్నుల హక్కుల బృందాలు గత వారం కోర్టులో సవాలు చేశాయి. ఇది అమెరికా రాజ్యాంగంలోని రెండో అమెండ్‌మెంట్‌ను ఉల్లంఘించడమేనని వాదించాయి. ఈ నేపథ్యంలోనే ఫెడరల్ సైబర్ సెక్కురిటీ ఏజెన్సీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2020-03-29T18:52:00+05:30 IST