ఊరూరా.. వజ్రోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2022-08-14T07:37:08+05:30 IST

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి.

ఊరూరా.. వజ్రోత్సవ వేడుకలు
జాతీయ జెండా చేత పట్టుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, ప్రజా ప్రతినిధులు

జిల్లాలో అంబరాన్నితాకుతున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

ఊరూ.. వాడల్లో దేశభక్తి సంబుర నినాదాలు

కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ నేతృత్వంలో అన్ని శాఖల భాగస్వామ్యం 

స్వచ్చంధంగా తోడవుతున్న స్థానికులు 

ఇళ్లపై జాతీయజెండా రెపరెపలు 

వరుస కార్యక్రమాలతో అంతా పండుగ శోభ 

నిర్మల్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఊరూ...వాడ అంతా పండుగ సంబరంలో మునిగి తేలుతోంది. కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ నేతృత్వంలో ఈ నెల 8వ తేదీ నుంచి వజ్రోత్సవ వేడుకలకు జిల్లాలో శ్రీకారం చుట్టారు. కలెక్టర్‌ ప్రణాళిక బద్ధంగా రూపొందించిన కార్యక్రమాల షెడ్యూల్‌ ప్రకారం ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. రోజుకో కార్యక్రమం చొప్పున జాతీయ ప్రాముఖ్యత గల అంశాలను నిర్వహిస్తూ ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అన్నిశాఖల అధికారులతో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాలు, విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వేడుకలను కొనసాగిస్తున్నారు. అలాగే మహత్మగాంధీ చిత్రాన్ని విద్యార్థులందరికీ ఉచితంగా చూయిం చారు. జిల్లాకేంద్రంలోని నాలుగుథియేటర్‌తో పాటు భైంసాలోని ఒక థియేటర్‌లో ఫ్రీషో సౌకర్యం కల్పించారు. జిల్లావ్యాప్తంగా 25,815 మంది విద్యార్థులు గాంధీ సినిమాను తిలకించారు. అలాగే గ్రామగ్రామాన గ్రామపంచాయతీలు ప్రతీ ఇంటికి ఒక జాతీయజెండాను అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. మున్సిపాలిటీల్లో కూడా వార్డు కౌన్సిలర్‌లు ఈ జాతీయ జెండాల పంపిణీని చేపట్టారు. ప్రస్తుతం ప్రతిఇంటిపై జాతీయజెండా రెపరెపలాడుతోంది. బడి పిల్లలందరికీ ప్రతిరోజూ ఒక కార్యక్రమం చొప్పున ఏర్పాటు చేసి వజ్రోత్సవ కార్యక్రమాల నిర్వహణ ప్రాధాన్యతను వారికి వివరిస్తున్నారు. కలెక్టర్‌తో పాటు ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌లు కూడా పోలీసుశాఖ తరపున వరుస కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా వజ్రోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని స్పూర్తిగా నిలిచారు. రెండురోజుల క్రితం చారిత్రాక శ్యాంఘడ్‌కోట నుంచి ఎన్‌టీఆర్‌ మినీస్టేడియం వరకు నిర్వహించిన ఫ్రీడంరన్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు కలెక్టర్‌, ఎస్పీలు, ఇతర శాఖల అధికారులు, ఉన్నతాధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. మంత్రితో పాటు కలెక్టర్‌, ఎస్పీ, డిఎస్పీలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్దఎత్తున ఏర్పా టు చేశారు. కాగా కార్యక్రమాల నిర్వహణ అమలుపై కలెక్టర్‌ ప్రత్యేక బృందాలను సైతం నియమించారు. అడిషనల్‌ ఎస్పీలు హేమంత్‌బోర్కడే, రాంబాబు, డీఎఫ్‌ఓ వికాస్‌మీనాలతో పాటు తదితరులతో కలిసి హరితహారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే కలెక్టర్‌ సమీక్షల వివరాలను ఎప్పటికప్పుడు సర్కారుకు పంపుతూ ప్రగతిని సర్కారుకు వివరించారు. అన్ని పాఠశాలల్లో కూడా వరుస కార్యక్రమాలను ఏర్పాటు చేయిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఆటలు, వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహిస్తూ వారికి స్వాతంత్య్ర ఉద్యమ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే స్వాతంత్య్ర సమరయోధుల జీవితచరిత్రలను కూడా విద్యార్థులకు వివరిస్తున్నారు. 

కలెక్టర్‌ నేతృత్వంలోనే..

కాగా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సప్తహా వేడుకల నిర్వహణకు కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రణాళికల ప్రకా రం రోజుకో కార్యక్రమాన్ని నిర్ధేశించారు. ఇటు వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పజెప్పిన కలెక్టర్‌ అందరి భాగస్వామ్యానికి ప్రాధాన్యత కల్పించారు. రోజుకో కార్యక్రమం చొప్పున అధికారులకే కాకుండా ప్రజలందరి భాగస్వామ్యం ఉండేట్లు ఆయన షెడ్యూల్‌ తయారు చేశారు. దీని ప్రకారం ప్రతిరోజూ పండుగ సంబురాల రీతిలో వజ్రోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. కార్యక్రమాల నిర్వహణ తీరుపై సంబంధిత మండల తహసీల్దార్‌లతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ కలెక్టర్‌ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడ కూడా లోపాలు తలెత్తకుండా ఫ్రీడంరన్‌, విద్యార్థుల ర్యాలీలు, అలాగే విద్యార్థులకు వివిఽ ద రకాల పోటీల నిర్వహణ లాంటి అంశాలకు ప్రాధాన్యత కల్పించా రు. జాతీయ స్పూర్తి వెల్లివెరిసేలా రూపొందించిన కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

అందంగా ముస్తాబైన జిల్లా

కాగా వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఎస్పీ కార్యాలయం, ఇతర అన్నిప్రభుత్వశాఖల కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. రంగు రంగుల విద్యుద్దీపాలతో కార్యాలయాన్ని అలంకరించారు. జిల్లా కేంద్రంతో పాటు భైంసా, ముథోల్‌, ఖానాపూర్‌లలో కూడా కార్యాలయాలను అందంగా అలంకరించారు. శాఖల వారిగా అధికారులు ఈ కార్యక్రమంలో సీరియస్‌గా భాగస్వాములవుతున్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో సంబురాలు అంబరాన్ని తాకుతున్నాయి. ముందస్తు పంద్రాగస్టుగానే గత నాలుగైదు రోజుల నుంచి విద్యార్థులు భావిస్తున్నారు. పాఠశాలల్లో రంగుల తోరణాలు కట్టి ముస్తాబు చేశారు. ఇలా పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించి వారిలో మరింత దేశ భక్తిని పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలను సైతం అందంగా అలంకరించి అక్కడి ప్రతి ఇంటిపై భారతదేశ జెండా ఎగిరేట్లు చూస్తున్నారు. 

సమష్టి కృషితోనే

కాగా జిల్లాలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు అందరి భాగస్వామ్యంతో విజయవంతమవున్నాయంటున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో అందరు పాల్గొంటుండడం అందరిలో రెట్టింపు ఉత్సా హం నింపుతోంది. ముఖ్యంగా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌, డీఎఫ్‌ఓ వికాస్‌మీనా తదితర ఉన్నతాధికారులంతా మొద టి నుంచి వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లను సమీక్షించారు. శనివారం స్థానిక ఎన్‌టిఆర్‌ మినిస్టేడియంలో ఏర్పాటు చేసిన ఫ్రీడం రన్‌ కార్యక్రమానికి జిల్లా నుంచి వేలాది మంది తరలివచ్చారు. మొత్తానికి స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు రోజుకో కొత్త రీతిన నిర్వహిస్తూ ప్రజల్లో స్వాతంత్య్ర స్పూర్తి, ఉద్యమకాంక్ష లాంటి అంశాలను వెల్లడిస్తున్నారు. 

Updated Date - 2022-08-14T07:37:08+05:30 IST