ఐకేపీ కేంద్రాలను ఎత్తివేస్తే ఊరుకోం

ABN , First Publish Date - 2021-01-25T05:43:51+05:30 IST

రైతులు కనీస మద్దతు ధరను పొందే ఐకేపీ కేంద్రాలను ఎత్తివేస్తే ఊరుకోమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.

ఐకేపీ కేంద్రాలను ఎత్తివేస్తే ఊరుకోం
తిప్పర్తిలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తిప్పర్తి/చిట్యాల, జనవరి 24: రైతులు కనీస మద్దతు ధరను పొందే ఐకేపీ కేంద్రాలను ఎత్తివేస్తే ఊరుకోమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. తిప్పర్తి మండలకేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తానంటూ చెప్పిన సీఎం ఢిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత మాట మార్చారన్నారు. ఐకేపీ కేంద్రాల వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందంటూ ప్రకటించుకొని కేంద్రాలను ఎత్తివేసే విధంగా మాట్లాడుతున్న సీఎం వైఖరి సరైంది కాదన్నారు. ఒకవేళ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకంటే తీవ్రంగా రాష్ట్రంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. రైతులకు మేలు చేస్తామని చెప్పి గెలిచిన కేసీఆర్‌ రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమన్నారు. నల్లగొండ నియోజవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పి పార్టీ వ్యక్తిని గెలిపించుకొని ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదన్నారు. 


వృద్ధుల సమస్యలపై శ్రద్ధ వహించాలి: కోమటిరెడ్డి 

వృద్ధుల సమస్యలపై ప్రభుత్వం శ్రద్ధ వహించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. చిట్యాల లో జరిగిన వయో వృద్ధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారికి  రూ.3వేల పింఛన్‌ ఇవ్వాలన్నారు.  


వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : చిరుమర్తి 

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నా రు. చిట్యాలలో జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడి, వెళ్లిన అనంతరం ఎమ్మెల్యే అక్కడికి వచ్చి మాట్లాడారు. అర్హులందరికీ ప్రభుత్వం పింఛన్‌ అందజేస్తోందన్నారు.  

Updated Date - 2021-01-25T05:43:51+05:30 IST