అరాచకాలు సృష్టిస్తే ఊరుకోబోం

ABN , First Publish Date - 2021-02-28T05:51:38+05:30 IST

అరాచకాలు సృష్టించడం ద్వారా తాత్కాలికంగా విజయం పొందొవచ్చు కానీ అంతిమ విజయం న్యాయానికే దక్కుతుందని, పోలీసులు, అధికారులను గుప్పిట్లో పెట్టుకుని అరాచకాలు సృష్టిస్తామంటే ఊరుకునేది లేదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాబి హెచ్చరించారు.

అరాచకాలు సృష్టిస్తే ఊరుకోబోం
కొత్తవలసలో మాట్లాడుతున్న పట్టాబి

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టాబి

కొత్తవలస , ఫిబ్రవరి 27: అరాచకాలు సృష్టించడం ద్వారా తాత్కాలికంగా విజయం పొందొవచ్చు కానీ అంతిమ విజయం న్యాయానికే దక్కుతుందని, పోలీసులు, అధికారులను గుప్పిట్లో పెట్టుకుని అరాచకాలు సృష్టిస్తామంటే ఊరుకునేది లేదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాబి హెచ్చరించారు. కొత్తవలస పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీచేసిన టీడీపీ మద్దతు అభ్యర్థి బోని తిరుపతిరావుకు మద్దతుగా టీడీపీ నిర్వహిస్తున్న నిరసన శిబిరానికి శనివారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనవిలేకరులతో మాట్లాడుతూ దేశంలో న్యాయ్యవ్యవస్థ బతికే ఉందని, ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం న్యాయానికే దక్కుతుందన్నారు. తిరుపతిరావు తరఫున హైకోర్టులో న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్దంగా కౌంటింగ్‌ సమయంలో రిటర్నింగ్‌ అధికారి, ఏజెంట్‌లు సంతకాలుగాని, పోటీ చేసిన అభ్యర్థుల సంతకాలుగాని, వెబ్‌కాస్టింగ్‌ చేయడానికి అవసరమైన సీసీ కెమెరాలుగాని, వీడియో రికార్డింగ్‌గాని చేయకుండా అప్రజాస్వామికంగా లెక్కింపు చేపట్టారని అన్నారు. ఓడిన వ్యక్తిని గెలిపించారని, ఇందుకు కారణమైన స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో పాటు అధికారులను, రిటర్నింగ్‌ అధికారిని బోనులో దోషిగా నిలబెడతామని హెచ్చరించారు.  ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, విశాఖపట్టణం పార్లమెంటరీ నియోజకవర్గ రైతు సంఘం ఆధ్యక్షుడు తిక్కానచినదేముడు, నాయకులు గొరపల్లి రాము, కోళ్ల వెంకటరమణ, పి.రాజన్న, కనకాల శివ ఉన్నారు. 

అవహేళన చేస్తారా?

టీడీపీ మద్దతు సర్పంచ్‌ అభ్యర్థికి జరిగిన అన్యాయంపై మనస్థాపం చెందిన జడ్పీటీసీ అభ్యర్థి గొరపల్లి సుజాత ఆత్మహత్యాయత్నం చేస్తే ఆమెను అవహేళన చేస్తారా? అని పట్టాబి ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు కనీస మానవత్వం లేదా?అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను అవహేళన చేయడానికి మనసు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 



Updated Date - 2021-02-28T05:51:38+05:30 IST