యూరియా ధరాభారం!

ABN , First Publish Date - 2021-08-27T05:45:45+05:30 IST

కేంద్ర ప్రభుత్వం యూరియా, డీఏపీ ధరలు నిర్ణయించింది. కానీ వ్యాపారులు విక్రయించే ధరలకు, ఆర్‌బీకే(రైతు భరోసా కేంద్రాల్లో) నిర్ణయించిన ధరలకు వ్యత్యాసం ఉంది.

యూరియా ధరాభారం!

ఆర్‌బీకేలకే ఫ్రీ ఆఫ్‌ లిఫ్టింగ్‌

తమకూ వర్తింపజేయాలని కోరుతున్న వ్యాపారులు

లేకుంటే ఎమ్మార్పీకి అమ్మలేమంటూ ఆవేదన

ఉన్నతాధికారులకు వినతి


(గుంటూరు - ఆంధ్రజ్యోతి) 

  కేంద్ర ప్రభుత్వం యూరియా, డీఏపీ ధరలు నిర్ణయించింది. కానీ వ్యాపారులు విక్రయించే ధరలకు, ఆర్‌బీకే(రైతు భరోసా కేంద్రాల్లో) నిర్ణయించిన ధరలకు వ్యత్యాసం ఉంది. ఆర్‌బీకేలో అమలు చేస్తున్న నిబంధనలు తమకూ వర్తింపజేస్తే తామే నిర్ణీత ధరలకు అమ్ముతామని వ్యాపారులు అంటున్నారు. 

యూరియా బస్తా ధర రూ.266.50 ఉండగా రూ.340 - రూ.350 చొప్పున, డీఏపీ ధర రూ.1,200 ఉండగా రూ.1,300 - రూ.1,350 విక్రయిస్తున్నారు. అదేమని అడిగితే ఎరువుల కంపెనీలు వ్యాపారులకు ఫైట్‌ ఆన్‌ లారీట్రాన్స్‌పోర్టు (ఎఫ్‌ఓఎల్‌ - ఫ్రీ ఆఫ్‌ లిఫ్టింగ్‌) ఇవ్వటం లేదని అసోసియేషన్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే ఎఫ్‌ఓఎల్‌ ప్రభుత్వం నడుపుతున్న ఆర్‌బీకేలకు ఇస్తున్నారు. కంపెనీలు ఎఫ్‌ఓఎల్‌ ఇవ్వకపోవటం వలన నిర్ణీత ధరకు అమ్మాలంటే బస్తాకు రూ.30- రూ.40 చొప్పున నష్టపోతామని వ్యాపారులు చెబుతున్నారు. యూరియా, డీఏపీ అందుబాటులో లేదని, అందువలన ధర పెరిగినట్లు మరోవాదన వ్యాపారులు వినిపిస్తున్నారు. జిల్లాలో పత్తి, వరి పంటలకు ప్రస్తుతం యూరియాను ఉపయోగించాలి. సీజన్‌ ప్రారంభదశలోనే ఎరువులు బ్లాక్‌మార్కెట్‌ నడుస్తుంటే పంటలసాగు పూర్తయిన తరువాత ఎలా ఉంటుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ కంపెనీలు యూరియాకు సూక్ష్మ ఎరువులను లింక్‌ చేస్తున్నారు. జింక్‌, బోరాన్‌, మెగ్నీషియం, నీటిలో కరిగే ఎరువుల వంటి రకాలను అంటగడుతున్నారు. డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ వంటి సంస్థలకు కూడా యూరియా, డీఏపీ కేటాయింపులు తగ్గాయని డీసీఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ రావిపాటి కోటేశ్వరరావు తెలిపారు.  

 

ఎఫ్‌ఓఎల్‌ ఇవ్వటం లేదు... 

కంపెనీలు, ప్రభుత్వం ఎరువుల వ్యాపారులకు ఎఫ్‌ఓఎల్‌ ఇవ్వటం లేదు. దీంతో యూరియా, డడీఏపీలలో మార్జిన్‌ లేకపోయినా నష్టానికి కొనాల్సివస్తోంది. ఎఫ్‌ఓఎల్‌ను ఇప్పించాలని వ్యవసాయశాఖ రాష్ట్ర, జిల్లా అధికారులు, మంత్రిని కోరినా సమస్య పరిష్కారం కాలేదు.  

 - నాగిరెడ్డి, ఎరువుల వ్యాపారుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు 

Updated Date - 2021-08-27T05:45:45+05:30 IST