కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా...

ABN , First Publish Date - 2021-04-06T18:01:42+05:30 IST

మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు ఎండా కాలంలో విపరీతంగా వేధిస్తాయి. ఇప్పటికే ఇలాంటి సమస్యలున్నవాళ్లతోపాటు లేనివాళ్లు కూడా వేసవిలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే వాతావరణంలోని వేడి మూత్రాశయ వ్యవస్థని అస్తవ్యస్థం చేస్తుంది.

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా...

ఆంధ్రజ్యోతి(06-04-2021)

మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు ఎండా కాలంలో విపరీతంగా వేధిస్తాయి. ఇప్పటికే ఇలాంటి సమస్యలున్నవాళ్లతోపాటు లేనివాళ్లు కూడా వేసవిలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే వాతావరణంలోని వేడి మూత్రాశయ వ్యవస్థని అస్తవ్యస్థం చేస్తుంది.


మూత్ర వ్యవస్థ సక్రమంగా పని చేయాలంటే ఒంట్లో తగినన్ని నీళ్లు ఉండాలి. డీహైడ్రేషన్‌, పనిలో పడి నీళ్లు తాగకపోవటం, సమతులాహారం తీసుకోకపోవటం, దాహార్తికి నీళ్లకు బదులుగా ఏరేటెడ్‌ డ్రింక్స్‌ మీద ఆధారపడటం వల్ల వేసవిలో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్లు అనే రెండు ప్రధాన సమస్యలు తలెత్తుతాయి. అప్పటికే ఈ సమస్యలు ఉన్నవాళ్లకు వేసవిలో ప్రమాదం మరీ ఎక్కువ. ఇలాంటి వాళ్లు ఉప్పు, మాంసాహారం తగ్గించాలి. వారానికి ఒకటి రెండు సార్లు తక్కువ మోతాదులో మాంసాహారం తినటం వల్ల ప్రమాదం ఉండదు. కానీ ప్రతి రోజూ తింటే సమస్య కొని తెచ్చుకున్నట్టే! ఇక పాలకూర, టమాటా తినటం వల్ల కిడ్నీ స్టోన్స్‌ వస్తాయని చెప్పలేం. కానీ కిడ్నీ స్టోన్స్‌ వచ్చే అవకాశం ఉన్నవాళ్లు వేసవిలో వీటికి దూరంగా ఉండటమే మంచిది. రాళ్లు ఉన్నవాళ్లు ఆహారంలో జీడిపప్పు, బాదం పప్పులు కూడా తగ్గించాలి. పాలు తాగితే వాటిలోని కాల్షియం వల్ల మూత్రపిండాల్లో రాళ్లొస్తాయని అనుకుంటూ ఉంటారు. ఆహారం ద్వారా శరీరానికి అందే కాల్షియంతో రాళ్లు తయారయ్యే అవకాశాలు తక్కువ. అలాకాకుండా మాత్రల రూపంలో కాల్షియం శరీరంలోకి చేరితే అది మూత్రపిండాల్లో రాయిగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైద్యుల సలహా తీసుకోకుండా కాల్షియం టాబ్లెట్లు తినకూడదు.


యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ (యుటిఐ)

ఆరోగ్యకరమైన వ్యక్తులతో పోలిస్తే మధుమేహులకు వేసవిలో యూరినరీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ కాలంలో మధుమేహులు వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగుతూ ఇన్‌ఫెక్షన్‌ కారక బ్యాక్టీరియాను మూత్రం ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. అలాగే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ కాలంలో మధుమేహులు క్రమంతప్పకుండా నెఫ్రాలజి్‌స్టని కలుస్తూ ఉండాలి. కిడ్నీ స్టోన్స్‌ ఉన్నవాళ్లకు కూడా తరచుగా యూటిఐ వస్తూ ఉంటుంది. మూత్రంలో మంట, జ్వరం, వాంతులు, తరచూ మూత్రవిసర్జన చేయాల్సిరావటం మొదలైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని కలవాలి.

Updated Date - 2021-04-06T18:01:42+05:30 IST