శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని ఉరి సెక్టార్లో చొరబాట్లను తిప్పికొట్టేందుకు ఆర్మీ భారీ ఆపరేషన్ చేపట్టింది. గత 24 గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఉరి ఉగ్రవాదిలో 19 మంది సైనికులు వీరమరణం పొందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే శనివారంనాడు ఎల్ఓసీ వెంబడి చొరబాటుదారుల కదలికలను భద్రతా బలగాలు పసిగట్టడంతో అప్రమత్తమయ్యారు. చొరబాటుదారులు ఇంకా అక్కడే ఉన్నారా, వెనక్కి వెళ్లిపోయారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని, అయితే చొరబాట్లను కనీస స్థాయికి అడ్డుకట్ట వేసేందుకు బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని ఆర్మీ శ్రీనగర్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన 15 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే తెలిపారు.
కాగా, గత వారం బండిపోర జిల్లాలోని గురెజ్ సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను బలగాలు విఫలం చేసాయి. పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నాయి. గత శనివారం శ్రీనగర్‌లోని నూర్ బాగ్ ఏరియాలో ఉగ్రవాదులు పోలీసు బృందంపై దాడి చేశారు. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.